మెదక్ జిల్లాలోని ఏడుపాయల్లో కొలువైన వనదుర్గా అమ్మవారి జాతర సమీపిస్తోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. జాతర సమయం దగ్గరపడుతున్నా... ఏర్పాట్లు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.
జాతర సందర్భంగా భక్తులు మొక్కుతీర్చుకొని ఇక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఏటా ఆలయ పరిసరాల్లో కొళాయిలు బిగించి నీటి కొరత లేకుండా చూస్తూ వచ్చారు. కానీ ఈసారి అలాంటి ఏర్పాట్లేవీ చేపట్టలేదు. గతంలో ఏర్పాటు చేసిన కొళాయిలు పాడైపోయాయి. ఆలయం వద్దకు చేరుకునే రహదారి అధ్వానంగా ఉంది. జాతరలోగా పనులు పూర్తి కాని పరిస్థితి.
శౌచాలయాల కొరత
అమ్మవారి దర్శనానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఆలయ పరిసరాల్లో కనీసం శౌచాలయాలు అందుబాటులో లేవు. జాతర సందర్భంగా తాత్కాలికంంగా ఏర్పాటు చేయడం... తర్వాత వాటి నిర్వహణ గాలికొదిలేయడం పరిపాటిగా వస్తోంది. ఉన్న కొన్నింటికీ తాళాలు వేయడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి అవీలేవు.
తాగునీటి ఇక్కట్లు
ఇక్కడికొచ్చే భక్తులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. తాగునీటి వసతి లేకపోవడం వల్ల నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు భారీగా ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. భక్తుల మొర పట్టించుకునేవారే కరవయ్యారు.
అధికారులు స్పందించాలి
జాతర నిర్వహణకు ప్రభుత్వం తాజాగా కోటి రూపాయలు మంజూరు చేసింది. ఇప్పుడైనా అధికారులు దృష్టి సారించి కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది