మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్ పల్లిలోని ఏడుపాయల వన దుర్గా మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరవరోజు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. మంజీరా నది వరద ఉద్ధృతి ప్రధాన ఆలయం ముందు నుంచి వెళ్లడంతో రాజగోపురంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోకుల్ షెడ్ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులకు, ప్రజలకు సాగునీరు, తాగునీటికి కొరత లేకుండా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు సుభాష్ రెడ్డి తెలిపారు.
మూలా నక్షత్రం కావడంతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. వనదుర్గ ప్రాజెక్టుగా పేరు మార్చిన తర్వాతనే ప్రాజెక్టు పొంగి పొర్లుతూ అమ్మవారి పాదాలను తాకుతూ వెళుతోందనీ, వనదుర్గగా పేరు మార్చినందుకు సీఎం కేసీఆర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సీఎం.. వ్యవసాయ శాఖ ద్వారా రికార్డు తెప్పించుకున్నారనీ, తప్పక న్యాయం చేస్తారని అన్నారు.
ఏడుపాయలకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కచ్చితంగా మాస్కు ధరించాలనీ, భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. అమ్మవారు రేపు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో తెలిపారు.
ఇదీ చదవండి: హెచ్1బీ వీసాలపై మరిన్ని ఆంక్షల దిశగా ట్రంప్ సర్కార్!