మెదక్ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట డిపోల్లో 658 బస్సులు ఉన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 369, సిద్దిపేట పరిధిలో 289 బస్సులు ఉండగా నిత్యం 2.67లక్షల కి.మీ తిరుగుతాయి. రోజుకు 2.50లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఛార్జీల పెంపుతోపాటు కండక్టర్లకు ప్రోత్సాహకాలు తదితర చర్యల కారణంగా ఆర్టీసీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తున్న సమయంలో లాక్‌డౌన్ అడ్డుకట్టవేసింది.
రీజియన్ వ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిత్యం ఆదాయం రూ.70.43 లక్షలు ఉండగా మార్చి 22కు ముందు రూ.84.40 లక్షలకు చేరడం విశేషం. పెరుగుదల నమోదవుతున్న తరుణంలో నష్టాలు మొదలయ్యాయి.
డిపోలో పరిస్థితి ఇదీ..
సాధారణ రోజుల్లో జిల్లాలో 1,237 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం అత్యవసర సేవల కింద రోజుకు డిపోకు 10మంది చొప్పున విధులకు హాజరవుతున్నారు. ఇందులో మెకానిక్‌లు ఎక్కువ మంది ఉంటున్నారు. బస్సులను సామర్థ్యంలో ఉంచేందుకు నిత్యం ఒక్కో బస్సును 15 నిమిషాలు స్టార్ట్ చేసి ఉంచుతున్నారు. మరమ్మతులు అవసరమైతే చేస్తున్నారు.
'బస్సులు కండీషన్‌లో ఉండేలా చూస్తున్నాం'
డిపోలకు పరిమితమైన బస్సులు కండీషన్‌లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. అత్యవసర విధులకు హాజరవుతున్న మెకానిక్ సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. సాధారణ పరిస్థితి వచ్చాక ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన కసరత్తు చేస్తామని ఆయన చెప్పారు.