Tiger Wandering In Nirmal : మళ్లీ పెద్దపులి కదలికలతో నిర్మల్ జిల్లాలోని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెద్దపులి నిర్మల్ జిల్లాలోకి వచ్చి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల 25న పెద్దపులి మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి బోథ్ మీదుగా సారంగాపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చింది. ఆ తర్వాత నర్సాపూర్(జి), దిలావర్‌పూర్, మళ్లీ సారంగాపూర్, మామడ, కుంటాల, పెంబి, ఖానాపూర్, కడెం, ఉట్నూరు, నార్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి వెళ్లిందని అటవీ అధికారులు గుర్తించారు.
తాజాగా శనివారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం కనకాపూర్, మామడ మండలం పరిమండల్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతానికి దగ్గర పత్తి చేనుల్లో పెద్ద పులి పాద ముద్రలు కనిపించాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి వెళ్లిన ప్రాంతంలో పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పాదముద్రలు తాజాగా ఉండటంతో ఇదే ప్రాంతంలో మరో పులి సంచరిస్తుందని అటవీ అధికారులు తెలిపారు. కనకాపూర్, పరిమండల్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుందని తెలియడంతో అక్కడి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.
జాడ కోసం అన్వేషణ : లక్ష్మణచాంద మండలం కనకాపూర్, మామడ మండలం పరిమండల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయం తెలియగానే అటవీ అధికారులు ఆ పులి జాడ కోసం వెతుకుతున్నారు. మామడ అటవీ రేంజీ అధికారి అవినాష్ నేతృత్వంలోని బృందం ఆ పులి ఏ వైపు వెళ్లిందో అని అడుగుల ముద్రల ద్వారా తెలుసుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో అలజడి సృష్టించిన పులి తిరిగి మహారాష్ట్రలోకి వెళ్లింది. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందో అని అటవీ అధికారులు తెలుసుకుంటున్నారు. పులి సంచారంతో కనకాపూర్, పరిమండల్ గ్రామాల అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని ఎక్కడైనా పులి కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
హమ్మయ్యా ఆ పెద్దపులి వెళ్లిపోయింది - ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు
'ఆ పెద్దపులి ఇక్కడి నుంచి వెళ్లలేదు - దిశ మార్చి మళ్లీ వచ్చింది - ఒంటరిగా తిరగకండి'