ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా మెదక్ జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 నుంచి 70 రూపాయలు ఉన్న పెట్రోల్... భాజపా అధికారంలోకి వచ్చాక అమాంతం 100 దాటిందని తిరుపతి రెడ్డి అన్నారు. 2014 కంటే ముందు గ్యాస్ ధర 410 రూపాయలుంటే నేడు 810 రూపాయలకు పెరిగిందని తెలిపారు. ఓ వైపు కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు పెంచి మరింత ఇబ్బంది పెడుతున్నాయని తిరుపతి రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గ్యాస్, నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి