జిల్లాలో జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న మూడో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. జూన్ 1 నుంచి 8 వరకు, అన్ని గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు ప్రతి వార్డును సందర్శించి మురుగు కాలువలను శుభ్రం చేయించాలని సూచించారు. వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తాచెదారాన్ని తొలగించాలని, , ముళ్ల పొదలు తొలగించాలని కలెక్టర్ చెప్పారు.
రోడ్లపై వ్యర్థాలను తొలగించడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం, రోడ్ల వెంబడి పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను బయట పడవేసిన వారికి జరిమానా విధించాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, అందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధులు కావాలని ఆదేశించారు. అన్ని గ్రామాలలో ప్రజలు కరోనా నిబంధనలు విధిగా పాటించేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి ఈ సారి ఎక్కువ నిధులు విడుదల అవుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని జిల్లాలోని ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: తక్కువ ఖర్చులో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం