డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ పేరిట నిరుపేదల రక్తాన్ని పీల్చబోతుందని మెదక్ జిల్లా భాజాపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కమలం నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్లు కేటాయించి.. ఒక్కొ ఇంటికి రూ.1.70 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఆ నిధులను పక్కనపెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పిన తెరాస.. అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
గ్రామాల్లో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుంటే సాయం చేయాల్సిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లు వసూలు చేశారని.. ఇకనైనా తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేసే వరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదని తెల్చిచెప్పారు.
ఇవీ చూడండి: గోడు వినకుండా.. పొట్ట కొట్టారు..!