Christmas celebrations: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. మూడు లక్షల మందికి ప్రభుత్వ కానుకలు అందించినట్లు చెప్పిన ఆయన...కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్వదినాన్ని నిర్వహించుకోవాలని కోరారు.
ప్రత్యేక ప్రార్థనలు..
జంటనగరాల్లోని పలు చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాల వెలుగులతో ధగధగలాడుతున్నాయి. క్రైస్తవులు తెల్లవారుజాము వరకు ప్రార్థనలు, ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ గడిపారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ చర్చిలో వేలసంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో మూడు రోజుల పాటు జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దక్షిణ భారతదేశంలోని మెథడిస్ట్ చర్చిల్లో అతిపెద్ద చర్చిగా పేరొందిన జహీరాబాద్ మెథొడిస్ట్ చర్చిను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జగిత్యాలలోని సీఎస్ఐ చర్చిని విద్యుత్తుదీపాలతో అలంకరించారు.
ఇదీచూడండి: christmas wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు