ధరణి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిందని, దీని ద్వారా భూముల కొనుగోళ్లు, అమ్మకం సులభతరమైందని మెదక్ జిల్లా కలెక్టర్ యస్.హరీష్ అన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని పేర్కొన్నారు. ఎకరాకు రూ.2,500 చొప్పున ఫీజు చెల్లిస్తే మ్యుటేషన్ పూర్తవుతుందని చెప్పారు. కాగా ప్రస్తుతం ధరణిలో వస్తున్న అన్ని సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి ఒక చిన్న తప్పు కూడా దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ధరణి పోర్టల్‌లో వచ్చిన వివిధ భూ సమస్యల గురించి కలెక్టరేట్లో అన్ని మండలాల ఉప తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ధరణి ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మ్యుటేషన్, భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి కోసం భూ యజమానులు మీ సేవలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. వాటిని ఎందుకు పెండింగ్ పెట్టారో మూలాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి పార్ట్-బి లో మ్యుటేషన్, సర్వే నంబర్ మిస్సింగ్, రికార్డులను సవరించుటకు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. రమేష్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీఓలు శ్యామ్ ప్రకాష్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సంకల్ప సభకు వెళ్తున్న షర్మిలకు చౌటుప్పల్‌లో ఘనస్వాగతం