‘సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడుపడవోయ్.. దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్..’
అంటూ తెలుగుకవి గురుజాడ అప్పారావు ఆలపించిన గేయాన్ని ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉటంకించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నంతలో ఇతరులకు సాయపడాలని, తద్వారా దేశాభివృద్ధికి చేయూతనందించాలని అన్నారు.
అనగనగా ఒక రోజు..
కాంతారావు హైస్కూల్ విద్యనంతా మండల కేంద్రంలోని ప్రభుత్వపాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ బెంగళూరులో చదివారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక రోజు బెంగళూరుకు రైలులో వెళ్తుండగా ఒక స్టేషన్‌లో భిక్షాటన చేస్తున్న పిల్లలను చూసి చలించిపోయారు. తల్లిదండ్రులు లేనివారికి, పిల్లల పోషణ భారంగా మారిన వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనలో నుంచి ఏర్పడిందే.. ‘వర్డ్స్ ఓవర్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ.
ప్రస్థానం మొదలైంది ఇలా..
2006 జూన్ 30న అనాథశ్రమాన్ని ప్రారంభించడానికి అడుగులు పడ్డాయి. ఆ సమయంలో తన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో దాతలను ఆశ్రయించారు. తొలిసాయం విద్యాభారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు సురభీ ఆగమరావు అందించారు. తాండూరులో వారికి చెందిన 14 గదుల ప్రాంగణాన్ని పిల్లల కోసం అద్దె లేకుండా ఉచితంగా ఇచ్చారు. అలా కొన్నిరోజులు కొనసాగిన ఆశ్రమం ఆచార్య జేసన్, అతని స్నేహితుల సాయంతో.. 2014లో భీమారం మండలంలోని పొలంపల్లిలో 3.20 ఎకరాల స్థలం కోనుగోలు చేసి నిర్వహణ ప్రారంభించారు. సంస్థ నిధులతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. మరో భవనాన్ని పాఠశాల నిర్వహణ కోసం నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మందికి పైగా ఇక్కడ ఆశ్రయం పొందారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి మంచి హోదాల్లో ఉన్నారు.
అనుబంధంగా..
పోలంపల్లి ఆశ్రమంలో ప్రస్తుతం 72 మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. దీనికి అనుబంధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గతేడాది మరో ఆశ్రమాన్ని ప్రారంభించారు. అక్కడ సుమారు 20 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆశ్రమంలో ఉన్న పిల్లలను వారి బంధువుల ఇళ్లకు పంపించారు.
దాతల సహకారంతో..
ఆశ్రమాన్ని దాతలు, స్నేహితుల సహకారంతో నడిపిస్తున్నట్లు నిర్వాహకుడు కాంతారావు తెలిపారు. తన సోదరుడు రవీందర్ ఎస్టీపీపీలో గుత్తేదారుగా పనిచేస్తూ తనకు వచ్చిన లాభాల్లో సగం సంస్థ నిర్వహణకు అందజేస్తున్నారు. జైపూర్ ఎస్టీపీపీ ఉద్యోగులు, పొలంపల్లి, భీమారం మండలానికి చెందిన పలువురు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తమకు చేదోడువాదోడుగా ఉంటున్నారని వివరించారు. ఆశ్రమానికి అనుబంధంగా పీరల్స్ ఆఫ్ ఇండియా పాఠశాలను నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా వచ్చిన సొమ్మును ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దాతలు అందిస్తున్న విరాళాల నుంచి కొవిడ్ సమయంలో మండలంలోని పలు గ్రామాల్లోని పేదలకు నిత్యావసరాలు, దుప్పట్లను పంపిణీ చేశారు.
క్రీడల్లో మెరిక
- డింజీల్, జూడోలో జాతీయస్థాయి క్రీడాకారుడు(అండర్ 14)
పొలంపల్లిలోని ఆశ్రమంలో 5వ తరగతి పూర్తి చేసుకొని ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన ఎన్.డింజీల్ అండర్-14 జూడో జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం పంజాబ్‌లో శిక్షణ పొందుతున్న డింజీల్ ఇప్పటికే అనేక పతకాలను సాధించారు.
ఇదీ చదవండి:వైరా నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎంపీ నామ భేటీ