గృహాలు ఉన్నట్లు చూపించిన స్థలం
అక్కడ ఒక్క ఇంటి నిర్మాణం లేదు.. కనీసం మొదలుపెట్టిన ఆనవాళ్లూ లేవు. ఎటు చూసినా ఖాళీ స్థలమే కనిపిస్తుంది. మున్సిపల్ అధికారుల దృష్టిలో మాత్రం అక్కడ 44 ఇళ్ల వరకు ఉన్నట్లు కనిపిస్తాయి. అదేంటి మనకు కనిపించకుండా.. వాళ్లకు ఎలా కనిపిస్తుందనా.. మీ అనుమానం. అవును ఇది నిజమే.. అక్కడ ఏం కనిపించకున్నా 44 మాయా గృహాలు ఉన్నట్లు నమ్మి తీరాల్సిందే. మహాభారతంలో మయసభ లాంటివన్న మాట. స్థిరాస్తి వ్యాపారులు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సర్వే నం.20, 21లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఇంటి నంబర్లు పొందడం విస్మయం కలిగిస్తోంది.
గూగుల్ మ్యాప్‌లో చూపిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు భూమి
మున్సిపల్ చట్టం ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాణ స్వభావాన్ని అనుసరించి, విస్తీర్ణం ఆధారంగా పన్ను నిర్ణయిస్తూ, నెంబరు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు భౌతికంగా సర్వే నిర్వహించి, నిర్ధారణ చేయాలి. ఇక్కడ మాత్రం ఖాళీ స్థలాన్ని గృహాలున్నట్లుగా నమ్మించి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ మాయా గృహాలను రిజిష్టరు చేయడం విశేషం. రిజిస్ట్రేషన్ చేసేముందు అక్కడ ఇల్లు ఉందా, లేదా.. అని నిర్ధారించుకున్న తర్వాతే రిజిష్టరు చేయాల్సిన అధికారులు.. కేవలం కాగితాలను చూసి పని చేస్తున్నారు. అదీ ఒక్కరి పేరిటే 40కిపైగా గృహాలున్నా పట్టించుకోకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. మున్సిపల్, రెవెన్యూ, తనిఖీ అధికారి నుంచి మొదలుకుంటే పైస్థాయి వరకు ఎంతో మంది అధికారులు ఏమవుతుందిలే అన్న నిర్లిప్తతతో మాయా గృహాలకు అనుమతినివ్వడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ భూమి నుంచి వెంచర్‌లోకి వేసిన రహదారి
పాలనాధికారి కార్యాలయ నిర్మాణాలకు వంద గజాల దూరంలోనే..
ఇదేదో మారుమూల ప్రాంతంలో ఉంటే, అధికారులు చూడలేదేమో అనుకోవచ్ఛు! జిల్లా పాలనాధికారి కార్యాలయ నిర్మాణం చేపడుతున్న ప్రాంతానికి కేవలం వంద గజాల దూరంలో ఉన్న ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతుల లేవని అధికారులకు తెలుసు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిత్యం విధులు నిర్వర్తించేందుకు వెళ్లే పురపాలిక కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటుందీ వెంచర్.
ఒక్కరి పేరుమీద అనేక ఇంటి నంబర్లు కేటాయించిన అధికారిక పత్రం
ప్రభుత్వ భూమి కబ్జా
జిల్లా పాలనాధికారి కార్యాలయానికి కూత వేటుదూరంలో ఉన్న 20, 21 నంబరు సర్వే నెంబర్లును ఆనుకుని 42 సర్వే నెంబరు ఉంది. ఇందులో ఉన్న ప్రభుత్వ భూమి దాదాపు అర ఎకరం వరకు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. అసలీ వెంచర్‌కు వెళ్లడానికి దారి లేదు. 42 సర్వే నెంబరులో ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ నీటి ట్యాంకు కోసం వేసిన రహదారిని ప్రైవేటు వెంచర్‌కు రాచమార్గంగా మార్చుకున్నారు. ప్రభుత్వభూమిలో ఉన్న రహదారిని వెంచర్‌కు పొడిగించుకుని దాని వెనుక ఉన్న మరో భూమికి దారి ఇవ్వడానికి పెద్ద మొత్తం డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
నస్పూర్‌లో ఎక్కడైనా ఎకరం భూమి దాదాపు రూ. రెండు కోట్లకుపైనే ధర పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి చదరపు గజం స్థలానికి రూ. 12 వేల నుంచి రూ. 50వేల వరకు ధర పలుకుతుండటంతో, స్తిరాస్థి వ్యాపారులకు లాభాలు దండిగా ఉండటంతో అధికారులకు పెద్ద ఎత్తున అమ్యామ్యాలు సమర్పించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపడితే జిల్లాలోనే అతిపెద్ద కుంభకోణం వెలికి చూసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: దుండగుల దాడి... కోలుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి