Three accused have remanded in burning six people alive case: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురి సజీవ దహనం కేసులో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించింది. ఏ1 మేడి లక్ష్మణ్, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4 వేల్పుల సమ్మయ్యను మూడు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం నిందితులను జిల్లా జైలుకు తరలించారు.
అసలేం జరిగిందంటే : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో శివయ్య అనే వ్యక్తి ఇంట్లో 17వ తేదీ అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్నికీలలకు ఇంటి యజమాని శివయ్యతో పాటు.. ఆయన భార్య పద్మ చనిపోయారు. పద్మ అక్క కుమార్తె మౌనికతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు.. శాంతయ్య అనే సింగరేణి ఉద్యోగి సైతం అగ్నికీలలకు సజీవ దహనమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో తేలిన నిజం ఏంటి అంటే.. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని.. తనకు డబ్బులివ్వడంలేదని, పట్టించుకోవడం లేదనే కక్షతో ఆమె తన భర్తను చంపేందుకు భార్యనే ఈ పని చేసింది. ఆస్తి ఆశ చూపి ప్రియుడిని ఉసిగొల్పింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
లక్షెట్టిపేట మండలం ఉట్కూర్‌కు చెందిన సృజనకు డాక్యుమెంట్ రైటర్ మేడి లక్ష్మణ్‌తో 2010లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ఆమె భర్త, సింగరేణి ఉద్యోగి అయిన శనిగారపు శాంతయ్య గుడిపెల్లికి చెందిన పద్మతో అదే గ్రామంలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పద్మకే ఇస్తానంటూ శాంతయ్య తరచూ గొడవపడేవాడు.
శాంతయ్య జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలూ తనకే దక్కాలని సృజనతో లక్ష్మణ్ కోర్టులో కేసు వేయించాడు. గొడవల నేపథ్యంలో భర్తపై కక్ష పెంచుకున్న సృజన.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకుని లక్ష్మణ్‌ను ఉసిగొల్పింది. అతనిని హత్య చేస్తే తన కుమార్తె పేరు మీద ఉన్న కోటి రూపాయల విలువైన భూమిని అతనికి రాస్తానని నమ్మబలికింది. డబ్బు మీద ఆశతో శ్రీరాముల రమేశ్ అనే వ్యక్తితో అతను హత్యకు కుట్ర పన్నాడు. రెండుసార్లు చంపడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇంక ఎలాగైనా చంపాలని భావించి అదే గ్రామానికి చెందిన సమ్మయ్యను సంప్రదించారు. ఇతను శాంతయ్య, పద్మ కదలికలను గమనించి.. వారికి చెప్పేవాడు.
ఈ నెల 16న మధ్యాహ్నం సమ్మయ్య రమేశ్‌కు ఫోన్ చేసి.. శాంతయ్య, పద్మ ఇంట్లోనే ఉన్నారని తెలిపాడు. శ్రీపతిరాజు అనే వ్యక్తి ఆటోలో మూడు క్యాన్లలో పెట్రోలు తెప్పించారు. లక్ష్మణ్ అదే ఆటోలో మంచిర్యాలకు చేరుకుని ఓ లాడ్జిలో ఉండి ఉదయం లక్షెట్టిపేటకు వెళ్లాడు. మర్నాడు రమేశ్ అతడి వద్దకు వెళ్లి.. మంటల్లో ఆరుగురు చనిపోయారని చెప్పాడు. హత్యల అనంతరం వీరిద్దరూ తప్పించుకుని తిరుగుతుండగా మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరాంపూర్ వద్ద సృజన, ఆమె తండ్రి అంజయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: