ఇది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామం. నాలుగేళ్ల క్రితం వరకు బాల్య వివాహాలకు చిరునామాగా నిలిచిందీ పల్లె. పెళ్లీడు రాకమునుపే బాలికలను ఇంటి గడప దాటించే సంస్కృతి... అక్కడి గ్రామస్థుల జీవితాల్లో భాగంగా మారిపోయిన దుస్థితి. బాలికలకు ఇష్టం లేకపోయినా ఓ అయ్య చేతిలో పెట్టాలనే తల్లిదండ్రుల ఆదికాలం నాటి ఆలోచనా విధానం... బాలికలు బలవంతపు కాపురాలతో అరిగోస పడేలా చేసింది. 2016 కంటే ముందు ఏటా కనీసం 10 నుంచి 15 బాల్య వివాహాలు జరిగేవి. ఈ సమయంలో ఓ బాలిక అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు పెట్టుకున్న మొర... అక్కడి అమ్మాయిల జీవితాల్లో నూతన శకానికి శ్రీకారం చుట్టింది.
గ్రామస్థులతో ప్రమాణం
మంచిర్యాలలో 2017 ఏప్రిల్‌లో బాలోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన అప్పటి కలెక్టర్ కర్ణన్‌కు... బాలిక రమాదేవి బాల్య వివాహాల కట్టడికి విజ్ఞప్తి చేసింది. చదువుకోవాలని ఉన్నా తల్లిదండ్రులు చిన్న పిల్లలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన జిల్లా పాలనాధికారి... గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. బాల్య వివాహాలు చేయబోమని గ్రామస్థులతో ప్రమాణం చేయించారు. మైనర్లకు పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక సత్ఫాలితానిచ్చింది. ప్రస్తుతం గ్రామంలో 200 మంది డిగ్రీ పట్టభద్రులు ఉండగా... 18 మంది ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించి సత్తాచాటారు.
నేడు ఆదర్శంగా..
కలెక్టర్ కర్ణన్ సూచనలతో గ్రామంలో బాల్యవివాహాలను పూర్తిగా తగ్గిపోయాయి. అవగాహన లేకే తమ బిడ్డలను చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేశామని ఆవేదన చెందుతున్నారు. ఇకపై గ్రామంలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా చూస్తామని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మూఢ నమ్మకాలు, ఆచారాలతో బాలికల చదువులను మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేసిన ఆ గ్రామం... నేడూ చైతన్యమై ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు చదువులు పూర్తయ్యే వరకూ వివాహాలు జరిపించబోమని గ్రామస్థులు ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఉపాధ్యాయుల కృషి
బాల్య వివాహాల నిర్మూలన, బాలికల చదువే ప్రాధాన్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. బాలికలు క్రీడల్లోనూ రాణించేలా తర్ఫీదిస్తున్నారు.
మూఢ నమ్మకాలు, ఆచారాలతో బాలికల చదువులను మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేసిన ఈ గ్రామం...నేడూ చైతన్యమై ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు చదువులు పూర్తయ్యే వరకూ వివాహాలు జరిపించబోమని గ్రామస్థులు ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్