Missile Attack in Iraq : ఇరాక్‌లో ఆదివారం జరిగిన క్షిపణుల దాడి నుంచి రాష్ట్రానికి చెందిన సుమారు 20 మంది కార్మికులు బయటపడ్డారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం ఆవరణ సమీపంలో క్షిపణులు పడ్డాయి. ఈ దాడి జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే మంచిర్యాల జిల్లా జన్నారం, లక్షెట్టిపేట మండలాలతో పాటు జగిత్యాల, నిజామాబాద్ తదితర జిల్లాలకు చెందిన కార్మికులు నివాసం ఉంటున్నారు. క్షిపణుల ధాటికి వారు ఉంటున్న భవనం అద్దాలు పగిలిపోయాయి. తమకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని.. బంధువులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని వారు అంటున్నారు.
అందరూ క్షేమమే..
"మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం. ప్రస్తుతం ఇరాక్‌లో పనిచేస్తున్నాను. ఆదివారం క్షిపణులు పడిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అతి సమీపంలో ఉన్న జన్నారం, లక్షెట్టిపేట తదితర ప్రాంతాలకు చెందిన మిత్రులతో మాట్లాడాను. ప్రస్తుతం వారంతా గదుల్లోనే ఉంటున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. గల్ఫ్ సంక్షేమ సమితి నుంచి వారికి అన్ని విధాలా సాయం అందిస్తాం."
- - పురంశెట్టి నాగేశ్, గల్ఫ్ సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు
- ఇదీ చదవండి : 'నాతో ఫైట్‌కు రెడీనా'.. పుతిన్‌కు మస్క్ సవాల్