భాజపాతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన సుమన్ భాజపాకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం అడుగడునా వివక్ష చూపించలేదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం బంగారు తెలంగాణ చేస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
అభివృద్ధికి సహకరించకపోగా మోదీ, అమిత్ షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పలు సందర్భాల్లో అక్కసు వెళ్లగక్కారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. భాజపా విద్వేష రాజకీయాలను, తెలంగాణ వ్యతిరేక వైఖరిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని లేఖలో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'ఆదాయపు పన్ను తిరిగిస్తామంటే మోసపోకండి'