మందమర్రిలో పెద్దపులిని చంపిన దుండగులు
గత నెల 24న మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మం బేరసారాలు చేస్తుండగా నలుగురు వేటగాళ్లనుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు పలు మలుపులు తిరిగింది. ఇప్పుడు ఈ కేసులో 16 మంది కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ పులి చర్మం కావటంతో అటవీశాఖ అధికారులు ఈ కేసును రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. జైపూర్ మండలంలోని శివ్వారంలో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చినట్లు విచారణలో తేలింది.టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ముఠా సభ్యులు ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసులు తేల్చారు. ఈ సంస్థ అధ్యక్షుడు నంద కిశోర్ పింప్లేతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పులి హత్యలో ఎవరెవరు పాలు పంచుకున్నారో వారి పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో అటవీశాఖ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.