తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల దత్తతతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న రామోజీ ఫౌండేషన్ మరోసారి వృద్ధులకు అండగా నిలిచింది. సామాజిక బాధ్యతగా మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో వృద్ధాశ్రమాన్ని నిర్మించింది. ఈ నూతన భవనాన్ని రామోజీ ఫౌండేషన్ డైరెక్టర్ శివరామకృష్ణ, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ హోళికేరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిజంతో పాటు సామాజిక సేవా రంగంలో రామోజీ గ్రూపు తనదైన ముద్ర వేస్తోందని కలెక్టర్ భారతి హోళికేరి వ్యాఖ్యానించారు.
ప్రకృతి విపత్తులతో పాటు వివిధ అవసరాల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు రామోజీ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పేదల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం, అంకితభావంతో పని చేయడమే రామోజీరావు ఉద్దేశమని తెలిపారు.
మంచిర్యాలలో వృద్ధాశ్రమం నిర్మించాలని నిర్ణయించిన తర్వాత రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మెన్ రామోజీరావు తనకు ఈ బాధ్యతలు అప్పగించారని రామోజీ ఫౌండేషన్ డైరెక్టర్ శివరామకృష్ణ పేర్కొన్నారు. భవనం నిర్మిస్తే సరిపోదని.. వృద్ధులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రామోజీరావు సూచించారని తెలిపారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని వృద్ధులు చూసి మురిసిపోతున్నారు. తమ కోసం అందమైన భవనాన్ని నిర్మించిన రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు.
వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామోజీ ఫౌండేషన్ నూతన భవనం నిర్మించడం అభినందనీయమని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో అన్ని సదుపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. విశాలమైన గదులు, సౌర విద్యుత్ ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి..
ఆ ఆడబిడ్డల బాధ్యత మాది: గవర్నర్ ట్వీట్‌కు సుచిత్ర ఎల్ల రిప్లై
షిరిడీ సాయి హుండీ మరోసారి ఫుల్.. సామాన్యులకు సమాధిని స్పృశించే భాగ్యం