మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి అతిథి గృహంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, కలెక్టర్ భారతి హోళీ కేరి, ఐటీడీఏ పీవో మిశ్రాలతో సమావేశమైన మంత్రి గిరిజన శాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. తమ శాఖ ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని అధిగమించాలని సూచించారు.
గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో నాణ్యతా లోపం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి చెప్పారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తే పంపిణీదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మంచిర్యాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సఖి భవనాన్ని పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి కేంద్రాన్ని ప్రారంభించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు'