రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రస్తుతం గ్రామాల్లో మెరుగైన జీవన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి పనుల పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా మంచినీటి కొరత లేదని మంత్రి తెలిపారు.
ప్రజలంతా భాగస్వాములై పల్లెల ప్రగతికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ముందుగా అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి పని పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
చెన్నూర్ మండలం జోడువాగుల అర్బన్ ఫారెస్ట్ వద్ద హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరినన్ని నిధులు అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ఆయన కొనియాడారు.
ప్రతినెలా పంచాయతీలకు నిధులు
ప్రతినెలా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల వల్ల విష జ్వరాలు, అంటు వ్యాధులు తగ్గాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో మురుగు నీరు, పాడు బావులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి పనిలో నాయకులు, అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మంచినీళ్లకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు బావుల వెంట వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు స్థలముండేది కాదు. ఊరంతా కలిసి ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాం.- ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ఇదీ చూడండి: ERRABELLI DAYAKAR RAO: కలెక్టర్‌తో సహా అధికారుల తీరుపై ఎర్రబెల్లి ఆగ్రహం