మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వాకర్లకు , క్రీడా ప్రేమికులకు సింగరేణి పాఠశాల మైదానమే పెద్ద దిక్కుగా ఉండేది. నిత్యం వందలాదిమంది వ్యాయామకారులు, క్రీడాకారులు, యువకులతో ఈ మైదానం కళకళలాడుతుండేది. అయితే.. లాక్‌డౌన్ నేపథ్యంలో మైదానం గేటుకు తాళం పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినా.. మైదానం మాత్రం తెరవకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనధికారికంగా కొందరు వాకర్లు వినియోగించుకుంటున్నప్పటికీ.. అందులో వ్యాయామ సౌకర్యాలు గల పలు గదులకు తాళాలు ఉండడం, నిర్వహణ లోపించడం వల్ల మైదానం చిట్టడవిని తలపిస్తుంది.
వాకింగ్ ట్రాక్ మొత్తం పిచ్చిమొక్కలు, బురదతో ఆనవాల్లు కోల్పోయింది. వాకర్లు, క్రీడాకారులను విషసర్పాలు సంచరిస్తూ భయపెడుతున్నాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన క్రికెట పిచ్‌లో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి పిచ్ మొత్తం పాడైపోయింది. యోగా మందిరం, జిమ్ మూసి ఉండడం వల్ల అభ్యాసకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రోజు బయటకు వ్యాయామానికి వెళ్లలేక ఇబ్బందిగా ఉందని, ఫలితంగా వ్యాయామం మానేసి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా సింగరేణి పాఠశాల మైదానం తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి స్పందన లేదని.. సింగరేణి కార్మిక సంఘాల నాయకులు వాపోయారు.
ఇవీ చూడండి : నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. దిగువకు నీటి విడుదల