జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలి... ఎంచుకున్న రంగంలో విజయ బావుటా ఎగురవేయాలి అనే పట్టుదలతో చదివి వరుస ప్రవేశ పరీక్షల ఫలితాల్లో సత్తా చాటుతున్నాడు మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్. ఇంటర్ తర్వాత ప్రవేశాలకు పక్కా ప్రణాళికతో చదివి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలుస్తున్నాడు. కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్న సాయివర్ధన్... మంగళవారం విడుదలైన ఎంసెట్ ప్రవేశ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకుతో మెరిశాడు.
సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లోనూ జాతీయ స్థాయిలో 38, ఓబీసీ కేటగిరిలో 7వ ర్యాంకు సాధించాడు. పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమేనని సాయివర్ధన్ నిరూపిస్తున్నాడు. తండ్రి రమణారెడ్డి కాసిపేట ఉన్నత పాఠశాలలో, తల్లి జయ జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పదోతరగతిలో 9.5, ఇంటర్లో 967 మార్కులు సాధించాడు.
ఉన్నత స్థానంలో నిలవాలన్నదే తన లక్ష్యమని... అందుకు తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సాయివర్ధన్ తెలిపాడు. తనపై ఉంచిన నమ్మకానికి తగిన ఫలితం సాధించడమే లక్ష్యంగా చదివి ప్రతి పోటీ పరీక్షకు హాజరైన సాయివర్ధన్... ఒక్కో పరీక్ష ఒక్కో అనుభవమని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: ఐదేళ్లలో రూ.10.5 లక్షల కోట్ల సెల్‌ఫోన్ల తయారీ ప్రణాళిక