తాండూరు మండలం మాదారానికి చెందిన నడిపెల్లి సన్నిహిత అయిదో తరగతి నుంచి యోగా నేర్చుకుంటుంది. యోగాసనాలను క్షణాల్లోనే వేస్తుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. జాతీయస్థాయి పోటీల్లో మూడు సార్లు పాల్గొంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సార్లు వెండి పతకాలు, ఒకసారి బంగారు పతకం సాధించింది. ఏకపాదాసనం, నటరాజసనం, మురళీకృష్ణాసనం, ద్విపాసనం, పూర్ణఉష్ణాసనం, పూర్ణధనురాసం వేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. కఠోరమైన ఆసనాలను అబ్బురపరిచేలా వేస్తుంది. యోగా శిక్షకురాలు బోయ ఉమారాణి వద్ద శిక్షణ తీసుకుంటుంది.
జాతీయస్థాయిలో సత్తా..
మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజ్‌రోడ్‌కు చెందిన ఎర్రోజు సన ఏడో తరగతి చదువుతోంది. యోగా రాష్ట్రస్థాయి పోటీల్లో ఒకసారి వెండి పతకం, 2018, 2019లో రెండుసార్లు బంగారు పతకాలతో సత్తా చాటింది. 2017లో కోల్‌కతాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం దక్కించుకుంది. వృశ్చికాసనం, పద్మమయూరాసనం, ఫించమయూరాసనం, బకాసనం, భూమసనం, మురళీకృష్ణాసనం, నటరాజాసనం వంటి కఠినమైన ఆసనాలను క్షణాల్లో వేయగల నేర్పరి. శిక్షకుడు మండ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆసనాలను సాధన చేస్తుంది.
తైక్వాండోలోనూ అదుర్స్
మంచిర్యాల జిల్లా కేంద్రం అండాలమ్మ కాలనీకి చెందిన కార్ల శ్రీజ ఎనిమిదో తరగతి చదువుతోంది. 2016, 2017లో హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు, 2019లో వరంగల్ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో బంగారు పతకం, 2020లో సిద్దిపేట ఎస్‌జీఎఫ్ క్రీడల్లో రాష్ట్రస్థాయిలో వెండి పతకాలను సాధించింది. 2017లో తొలిసారి ముంబయిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. 2018లో నాసిక్‌లో, 2019లో విజయవాడలో జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 2019లో అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో వెండి పతకంతో అదరగొట్టింది. వృక్షాసనం, నటరాజాసానం, మురళీకృష్ణాసానం వంటి ఆసనాలను వేయడంలో దిట్ట.
ఇదీ చూడండి: సంపూర్ణ సౌందర్యానికి 'సహజ' మంత్రమేస్తున్నారు!