Gandhari Qilla Maisamma festival closing ceremony: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా జరుగుతున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ఆదివాసులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
గుట్టపై వెలసిన మైసమ్మకు బోనాలు సమర్పించి జంతువులను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. జాతరలో మెడికల్ క్యాంపు కూడా నిర్వహించారు. పోలీస్ సిబ్బంది జాతరల్లో ఎటువంటి తప్పు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర చివరి రోజు సందర్భంగా అమ్మవారిని జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్ట కింద ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాతరలో గిరిజనులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
"ఈ జాతర మహోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ జాతర చాలా ప్రాచుర్యమైనది. కాకతీయుల కాలం నుంచి ఈ ప్రదేశంలో ఉన్న దేవతలను ఆరాధిస్తున్నారు. పక్క రాష్ట్రాలు, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భక్తులు ఈ పండక్కి వస్తుంటారు. 1993 నుంచి ఈ జాతర ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తోంది." -ప్రసాద్ , భక్తుడు
"మూడు రోజుల నుంచి ఈ జాతర గొప్పగా జరుగుతుంది. భక్తులందరు అమ్మవారి దర్శించుకొని ఆనందంగా గడిపారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి రోజంతా ఉండి సంతోషంగా జాతరను ఆనందించారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. "- నల్లాల భాగ్యలక్ష్మి, జడ్పీ ఛైర్‌పర్సన్
ఇవీ చదవండి: