సీపీఐ సీనియర్ నాయకుడు, మజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్(75) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
గుండా మల్లేశ్.. బెల్లంపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. కింద స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా కార్మికుల మన్ననలు పొందారు.
గుండా మల్లేశ్ నిబ్ధతకు బెల్లంపల్లి ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. గుండా మల్లేశ్ మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
ప్రజల సందర్శనార్థం గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని సాయంత్రం 5 గంటలకు మక్దూమ్ భవన్‌కు తరలించనున్నారు. అనంతరం భౌతికకాయాన్ని బెల్లంపల్లి తరలిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.