Ex MLC Prem Sagar Rao: పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ.. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్కలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు మంచిర్యాల పర్యటనకు వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతురావును కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దూషించారని.. వారంతా మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు అనుచరులని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. రెండు రోజుల కిందట ప్రేమసాగర్‌రావుకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఆ అధికారం మీకు లేదు..
తాను ఏఐసీసీ సభ్యుడినని.. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే పరిధి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేదని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ షోకాజ్ నోటీసుకు ఈ రెండ్రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పారు. సమావేశం అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. హనుమంతరావును దూషించినట్లు వస్తున్న ఆరోపణల్లో తనకు ప్రమేయం లేదని ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. అదే విషయాన్ని క్రమశిక్షణ కమిటికీ నివేదిస్తానని చెప్పారు. తాను పార్టీ బలోపేతం కోసం.. ఏఐసీసీ అప్పగించిన డిజిటల్ సభ్యత్వంపై దృష్టి సారించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం వేగవంతంగా సాగుతోందన్నారు. ఇప్పటికే లక్షా 5 వేల సభ్యత్వాలు పూర్తయ్యాయని.. ఇంకా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Chinna jeeyar swamy : సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ అసమానత: చినజీయర్ స్వామి