Baby suffering for her mom: 'మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సాయిబాబా ఆలయంలో పూజారిగా పనిచేసే నాన్న శ్రీకర్‌చార్యులుకు, నిర్మల్‌కు చెందిన విద్యుష (25)తో గత ఏడాది మే 26న వివాహం జరిగింది. వారి ఆనందానికి గుర్తుగా జనవరి 28న నేను పుట్టాను. నాన్న దేవుడి సన్నిధిలో పూజలు చేస్తూనే.. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నేను పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరపడ్డారంటా. కానీ విధి మాపై పగబట్టింది. అమ్మను ఆసుపత్రి పాలు చేసింది. నాకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. అమ్మ ఒడిలోకి చేరుకోలేక.. బంధువుల ఇంట్లో ఉండలేక సతమతమవుతున్నాను. అమ్మ స్పర్శ లేక అల్లాడిపోతున్నాను. దీనికంతటికీ అదే కారణం.
అమ్మకు అరుదైన వ్యాధి సోకిందంట. ఎలాగైనా అమ్మను రక్షించుకోవాలని నాన్న తాపత్రయ పడుతున్నాడు. నా ఆలనను కూడా చూసుకునే సమయం నాన్నకు లేదు. అమ్మ ప్రేమకు .. నాన్న కౌగిలికి దూరమైన నా కళ్లు కన్నీరు కారుస్తున్నాయి. ఏమీ చేయలేని స్థితిలో నా తనువు అంతులేని బాధను అనుభవిస్తోంది.. పైగా నెలలు నిండకుండానే నేను జన్మించడంతో డబ్బు ఖర్చు చేసి నాకు ప్రాణం పోశారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆరోగ్యం క్షీణించింది.
అమ్మకు హైదరాబాద్‌లో బోన్‌మ్యారో పరీక్ష చేయగా.. అప్లస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇది లక్ష మందిలో ఒక్కరిద్దరికి మాత్రమే వస్తుందంట. ఆ మాయదారి రోగం అమ్మను అంటుకుంది. దీంతో నేను, నాన్న కుంగిపోయాం. వ్యాధి నయం కావాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందంట. నాన్నకు సమయానికి తిండి లేదు.కంటినిండా నిద్ర లేదు. వారు పడుతున్న బాధను నా కళ్లు చూస్తున్నాయి. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. ఉన్న బంగారం విక్రయించి, దొరికిన చోట అప్పులు చేసి నాన్న అమ్మకు ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్నారు. దాతల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అమ్మ ఆసుపత్రిలో ఐసీయూలో ఉండగా.. నేను బంధువుల ఇంట్లో ఉండిపోయాను. అమ్మ నన్ను చూడలేదు. నేను అమ్మ వద్దకు వెళ్లలేను.
ఏది ఏమైనా.. నాకు అమ్మ కావాలి. అమ్మ లేకుండా ఎలా బతకగలను. అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాలని.. అమ్మ చేతి గోరుముద్దలు తినాలని, అమ్మ చెప్పే కబుర్లు వినాలని ఆతృతగా ఉన్నాను. దాతలు దయ తలిస్తే అమ్మ బతుకుతుంది..నాలో ఆనందం విరుస్తుంది. మీరు చేసే సాయం నేను మరువను. నేను పెద్దయ్యాక ఎంతోమందికి సేవ చేస్తాను.' .. ఆదుకుంటారు కదూ.. మీ చిన్నారి.
ఇవీ చదవండి: మిల్లర్ల మాయాజాలం... చోద్యం చూస్తున్న అధికారులు...
'ఈవీ వాహనాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు'.. గడ్కరీ వార్నింగ్
ఉద్యోగాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా... నియామక సంస్థల పరిశీలనలు