అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో తెలంగాణ అటవీ కళాశాలకు చెందిన మరో విద్యార్థినికి సీటు లభించింది. మంచిర్యాల పట్టణానికి చెందిన సుహర్ష ఈ ఘనత సాధించింది.
హైదరాబాద్ శివారు ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ఆఖరి సంవత్సరాన్ని ఆమె ఇటీవలే పూర్తిచేసింది. అమెరికాలోని అలబామాలో ఉన్న అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్.. వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో సుహర్ష ప్రస్తుతం సీటు దక్కించుకుంది.
ఫీజు మాఫీ
రెండేళ్లకుగానూ 30 వేల డాలర్ల ట్యూషన్ ఫీజుకు విశ్వవిద్యాలయం మినహాయింపు ఇచ్చింది. ఫీజు మాఫీతో పాటు నెలకు 1500 డాలర్ల చొప్పున ఉపకారవేతనాన్నీ ప్రకటించింది.
ఈ రెండింటినీ కలిపితే రూ.50 లక్షలకు సమానమని తెలంగాణ అటవీ కళాశాల పేర్కొంది. రెండు నెలల క్రితం అటవీ కళాశాలకు చెందిన విద్యార్థిని సూర్యదీపిక సైతం ఇదే వర్సిటీలో ఎంఎస్ ఫారెస్ట్ జెనెటిక్స్‌లో సీటు దక్కించుకుంది.
చాలా ఆనందంగా ఉంది..
సుహర్ష తండ్రి సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వర్సిటీలో సీటు రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది. కళాశాల ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే సీటు దక్కిందని వివరించింది.