పాలమూరు జిల్లా కేంద్రంలోని మహిళా ఉద్యోగుల వసతి గృహమిది. ఒకప్పుడు ఇక్కడ వంద మందికిపైగా మహిళలు వసతి పొందే వాళ్లు. కానీ, అరకొర అసౌకర్యాలతో అవస్థలు పడలేక ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. ప్రస్తుతం 20మందితో వసతి గృహం నడుస్తోంది. ఉన్నవారికి కూడా సరైన వసతుల్లేక(Hostel problems) అల్లాడిపోతున్నారు. మంచినీటి వసతి సరిగ్గా లేకపోవడంతో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. భోజనం కూడా బాగా లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహం అపరిశుభ్రతకు(Hostel problems) నిలయంగా మారిందని.. గదుల్లో స్విచ్ బోర్డులు పనిచేయవని గోడు వెల్లబోసుకుంటున్నారు. భద్రతగా కనీసం వాచ్ మెచ్ కూడా లేరని మహిళలు వాపోతున్నారు.
ప్రైవేటు వసతి గృహాల్లో మహిళలకు నెలకు రూ.3000 నుంచి 3,500 వరకూ రుసుముగా వసూలు చేస్తున్నారు. అంత చెల్లించలేని వాళ్లు ప్రభుత్వ వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. రూ.1500 ఖర్చవుతోందని. వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని.. రుసుము రూ.2000కు పెంచుతామని చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లామని.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. నిర్వాహకులు మాత్రం సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెబుతున్నారు.
'ప్రస్తుతం నెలకు రూ.1500 పే చేస్తున్నాం. అయినా కరెక్టుగా ఫుడ్ పెట్టడం లేదు. ఇప్పుడు రూ.2000కు పెంచుతామంటున్నారు. రెండు వేల రూపాయలను మేము కట్టలేమని మేడమ్‌ను రిక్వెస్ట్ చేశాం. రూ.1500లకే మాకు కరెక్టు ఫుడ్ పెట్టాలి. హాస్టల్ బిల్డింగ్ రిపేర్ చేయించాలి. మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నాం. డైలీ రెస్ పెడతారు. కానీ క్వాలిటీ లేదు. అందులో పురుగులు వస్తున్నాయి. వాష్ రూములు, డోర్స్, లైట్లు కరెక్టుగా లేవు. వాటిని రిపేర్ చేయించాలని కోరుతున్నాం.'
- హాస్టల్లో ఉండే మహిళ
'బిల్డింగ్ నీట్‌గా ఉంచుతూ ఫుడ్ కరెక్టుగా పెట్టాలి. ఫస్ట్ వెయ్యి నుంచి రూ.1500 వరకు ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.2500 అంటున్నారు. పక్క ప్రైవేటు హాస్టల్లో రూ.2500 ఫీజు. అందులో మంచి ఫుడ్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. కానీ అంత ఫీజు కట్టలేక మేము ఈ హాస్టల్లో చేరినం. ఇందులో చదువుకునే వాళ్లు, డ్యూటీలు చేసేవాళ్లు, జాబ్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్లు ఉన్నారు. మేం ఏమన్న గట్టిగా అడిగితే టార్గెట్ చేస్తున్నారు.'
- హాస్టల్లో ఉండే యువతి
మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి(sunitha laxma reddy news) మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా వసతి గృహాన్ని సందర్శించగా.. గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్‌తో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సునీత లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
'వర్కింగ్ విమెన్ హాస్టల్ కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. అది కరెక్టుగా అందుతున్నట్లు లేదు. ఇక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా కలెక్టర్‌తో రివ్యూ చేసి సక్రమంగా అందేటట్లు చూస్తాం. మహిళా సమస్యలు పరిష్కరించేలా మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుంది.'
-సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Premature Baby: 5 నెలలకే పుట్టిన చిన్నారి.. గిన్నిస్ బుక్‌లో స్థానం