floods in Jadcherla: కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు తెగిపోతూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆక్రమణలతో నీటి వనరులు కుంచించుకుపోవటంతో ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. జడ్చర్ల పురపాలికలోనూ ఈ పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని చెరువులు, కుంటల చుట్టూ నివాసాలు ఏర్పడటంతో రెండు రకాల సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గటంతో పాటు ముంపు సమస్య పెరుగుతున్న వైనంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
జడ్చర్ల పురపాలిక పరిధి చెరువులు, కుంటలను కొన్నేళ్లుగా పట్టించుకోకపోవటంతో తెగిపోయే ప్రమాదముంది. ఇక్కడి భూములకు డిమాండు పెరగడంతో చెరువులు, కుంటలు, పాటు కాల్వలు కబ్జాకు గురయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిశాయి. చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. ఈ వర్షాల వల్ల ఆయా కుంటలన్నీ వరద నీరు, మురుగుతో నిండిపోయాయి. నీరు పెరిగితే సమీప ఇళ్లు ముంపునకు గురవుతాయి. చెరువులకు సమీపంలోనే నివాసాలు ఉండటంతో దుర్వాసన, ఈగలు, దోమలతో రోగాల బారినపడే ప్రమాదముంది.
పాలకవర్గంతో చర్చించి చర్యలు చేపట్టాం:
పురపాలిక ఛైర్‌పర్సన్ లక్ష్మి.. పాలకవర్గ సభ్యులతో కలిసి బాదేపల్లి ఊరకుంట, నల్లచెరువు, కావేరమ్మపేట ఊరకుంట, బురెడిపల్లిలోని కుంటలను పరిశీలించాం. ఊరచెరువు అలుగు వద్ద నీరు పారేందుకు తూము వద్ద ఏర్పాట్లు చేశాం. ఊరచెరువు, నల్లచెరువుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వం. ప్రజలు ఇలాంటి చోట ఇళ్లు కట్టుకోవద్దు. చెరువులు, కుంటల్లో వ్యర్థాలు వేయొద్దు. ఎవరైనా ఇందుకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. -- మహమూద్ షేక్, కమిషనర్, జడ్చర్ల పురపాలిక
చెరువుల వారీగా పరిస్థితి
వర్షాలతో కావేరమ్మపేటలోని నల్లచెరువులోకి భారీగా నీరు, మురుగు చేరింది. సమీపంలో ఉన్న పారిశ్రామికవాడ, అటుగా నిర్మించిన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. కావేరమ్మపేట బాబానగర్ సమీపంలోని ఊరకుంటలో కూడా మురుగు చేరింది. ఇక్కడ తీవ్ర దుర్వాసన, దోమలు, ఈగల సమస్య ఉన్నా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాత్రికి రాత్రి ఓ ప్రజాప్రతినిధి భర్త పొక్లెయిన్‌తో ఈ ఊరకుంట కట్టను తెంపడంతో మురుగు పొలాల్లోకి వెళ్లి రైతులు నష్టపోతున్నారు. బాదేపల్లిలోని ఊరచెరువులోని మురుగు పోచమ్మ ఆలయ సమీపానికి చేరింది. శివాలయం సమీపంలో ఇళ్లు, కట్టకు ఆనుకొని ఉన్న నివాసాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని భవనంలో మానసిక రోగుల కోసం ఏర్పాటుచేసిన ఆశ్రమం చుట్టు, విద్యానగర్ కాలనీ, అల్మాస్ వెంచర్ ప్రాంతంలో ఇళ్లకు ముప్పు ఉంది. ఇక్కడ ఉన్న మరో కుంట తూము, కట్టకు ఆనుకొని అక్రమంగా కొందరు ప్రహరీ నిర్మించారు. పాటు కాల్వలను కూడా మూసివేశారు. ఎత్తు ప్రాంతాల నుంచి వర్షపు నీరు కుంటలు, చెరువుల్లోకి చేరుతోంది. దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్ల గిడ్డంగి కూడా ఉంది. బురెడ్డిపల్లిలో ఉన్న రెండు కుంటల చట్టూ వెంచర్లు వెలిశాయి. నిర్మాణాలు జరిగితే ప్రమాదం తప్పదు. నల్లకుంటలో లాగే ఇక్కడ కూడా మురుగు చేరకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుత పాలకవర్గం చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, కట్ట, అలుగులు ఉన్నచోట నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఈ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. అలాంటి స్ఫూర్తి వస్తేనే గాంధీ కల సాకారం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం