ఉందానగర్-మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. తొలుత షాద్‌నగర్-గొల్లపల్లి (30 కి.మీ.), తర్వాత ఉందానగర్-షాద్‌నగర్ (30 కి.మీ.), దివిటిపల్లి-మహబూబ్‌నగర్ (15 కి.మీ.) పూర్తి కాగా.. మధ్యలో ఉన్న గొల్లపల్లి-దివిటిపల్లి (10 కి.మీ.) పనులు బుధవారం పూర్తయ్యాయి. దీంతో ఉందానగర్ (శంషాబాద్)-మహబూబ్‌నగర్ (85 కి.మీ.) మార్గంలో ఇప్పటివరకు ఒకే లైన్‌లో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, ఇప్పుడు రెండో లైను అందుబాటులోకి వచ్చింది. అదనంగా మరిన్ని రైళ్లు నడపడానికి, వేగం పెంచడానికి వెసులుబాటు వచ్చింది.
నిత్యం వేల మంది రాకపోకలు: ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవసరాల నిమిత్తం మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ పట్టణాల నుంచి నిత్యం వేల మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. నగరంలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారూ పెద్దసంఖ్యలో ఉన్నారు. సికింద్రాబాద్-ఉందానగర్ (శంషాబాద్) 28 కి.మీ. మార్గాన్ని ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో భాగంగా డబ్లింగ్, విద్యుదీకరణ చేశారు. మేడ్చల్, సికింద్రాబాద్ నుంచి ఉందానగర్ వరకు మెము రైళ్లు నడిపిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. 56 కి.మీ. దూరాన్ని కేవలం రూ.15 టికెట్‌తోనే ప్రయాణం చేయవచ్చు. లోకల్ రైళ్ల ప్రయాణం ఎంతో చవక. ఎంఎంటీఎస్ రైళ్లను మహబూబ్‌నగర్ వరకు పొడిగిస్తే సామాన్యులకు చవక ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
ప్రయాణ సమయం తగ్గించాలి: సికింద్రాబాద్-ఉందానగర్ 25 కి.మీ., ఉందానగర్-మహబూబ్‌నగర్ 85 కి.మీ. కలిపి మొత్తం 110 కి.మీ. మేర రెండో లైను అందుబాటులోకి వచ్చింది. గతంలో సింగిల్ లైన్ ఉండటం వల్ల ఒక మార్గంలో ఒక రైలు వస్తుంటే మరో మార్గంలో రైలును ఆపాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య పరిష్కారమైంది. రెండు లైన్లు రావడంతో ఆగాల్సిన అవసరం లేదు. పాత టైంటేబుల్‌ను మార్చి ప్రయాణం తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్త టైంటేబుల్ అమలు చేస్తే అరగంట ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
మహబూబ్‌నగర్-డోన్ అయితేనే.. : సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లు షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, గుంతకల్లు-గుత్తి మీదుగా వెళ్తాయి. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు 2015-16లో మంజూరైంది. 85 కి.మీ. దూరం, రూ.774 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. మహబూబ్‌నగర్-డోన్ మధ్య రెండో లైను నిర్మాణంలో ఉంది. డోన్ నుంచి అటు తిరుపతికి, ఇటు బెంగళూరు వెళ్లే రైళ్లకు దాదాపు రెండో లైను అందుబాటులో ఉంది. మహబూబ్‌నగర్-డోన్ డబ్లింగ్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, అనంతపురం, బెంగళూరు, మైసూర్‌కు రైలు ప్రయాణం సులభతరం అవుతుంది.