TS Agros: రాష్ట్రంలో వ్యవసాయ పంటల మార్పిడిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చిరుధాన్యాల రంగంలోకి ప్రవేశించింది. వరి, పత్తి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా టీఎస్ ఆగ్రోస్ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది యాసంగి సీజన్ నుంచి రైతుల్లో చిరుధాన్యాలు పంటల సాగు ప్రోత్సహిస్తూ అవి కొనుగోలు చేసి ఆహారోత్పత్తులు రూపొందించి "ఈట్ రైట్ బ్రాండ్"పై స్వచ్ఛమైన ఆహారం మార్కెటింగ్ చేయాలని సంకల్పించింది.
ఫుడ్ ఆన్ వీల్స్ పథకం...
తెలుగు రాష్ట్రాల్లో... ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో చిరుధాన్యాల వాడకం పెరుగుతున్న తరుణంలో మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వ్యవసాయ పట్టభద్రులైన యువత స్వయం ఉపాధి కల్పన కోసం సంచార ఔట్‌లెట్లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మారుతి సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకునేందుకు సిద్ధమైన ఆగ్రోస్... కస్టమైజ్డ్ టాటా ఏసీ వాహనం అందజేయనుంది. ఆ వాహనంలో చిరుధాన్యాల ఉత్పత్తులతోపాటు చేపలు సంపూర్ణ ఆరోగ్యం అన్న నినాదంతో మత్స్య ఉత్పత్తుల రుచులు ప్రజలకు చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అందుకోసం నమూనాగా రూపొందించిన సంచార ఔట్‌లెట్ విడుదల చేసి నాంపల్లి ఆగ్రోస్ కార్యాలయంలో ప్రదర్శన కోసం అందుబాటులో పెట్టింది. కల్తీలకు తావులేకుండా ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా నాణ్యమైన చిరుధాన్యాలు, సముద్రపు ఉత్పత్తులు "ఫుడ్ ఆన్ వీల్స్ పథకం" పేరిట మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు అన్నారు.
యువతే లక్ష్యంగా...
క్షేత్రస్థాయిలో రైతులకు సేవలందించడంలో ప్రసిద్ధిగాంచిన టీఎస్ ఆగ్రోస్.. యువతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పట్టభద్రులను ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రతి మండలంలో ఒకటి నుంచి మూడు, నాలుగు చొప్పున నడుస్తున్న ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వహణకు సంబంధించి వ్యవసాయ పట్టభద్రులకే లైసెన్సులు జారీ చేసి ప్రోత్సహిస్తూ... రైతులకు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులే కాకుండా పంట సాగులో తెగుళ్లు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందజేస్తోంది.
ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందించడం కోసం ఈట్ రైట్ బ్రాండ్‌పై మిల్లెట్స్‌ను ప్రమోట్ చేస్తున్నాం. అయితే వీటిలో కల్తీ జరగకూడదమే ఉద్దేశంతో మేమే ఇందులోకి వచ్చాం. మిల్లెట్స్‌తో పాటు సీ ఫుడ్‌ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. అవసరమైన చోటకు ఆహారాన్ని తరలించే ప్రొగ్రామ్‌లో భాగంగా ఫుడ్ ఆన్ వీల్స్‌ను కూడా ప్రారంభించాం. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన యువతను ఇందులో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
-- కె.రాములు, టీఎస్ ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్
యువతులకు కూడా...
గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాత సేవలో మరింత చురుకుగా నిమగ్నమయ్యేందుకు పెద్ద ఎత్తున విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ పట్టభద్రుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తోంది. కొందరైతే... ఏకంగా రూ. కోటి నుంచి రూ. 3 కోట్ల పైగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు పొందిన పట్టభద్రులే కాకుండా ఉత్సాహం గల విద్యావంతులు... ప్రత్యేకించి యువతులకు కూడా "ఫుడ్ ఆన్ వీల్స్ పథకం"లో అవకాశం కల్పించాలని ఆగ్రోస్ సంస్థ నిర్ణయించింది. యూనివర్సిటీల నుంచి పట్టా పుచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం అంటూ చూడకుండా స్వయం ఉపాధి వైపు వెళితే బాగుంటుందని సూచిస్తున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా పాలమూరు ఎంపిక...
రాష్ట్రంలో పంట మార్పిడిలో భాగంగా పెట్టుబడి వ్యయం తగ్గించి లాభసాటి పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. టీఎస్ ఆగ్రోస్ సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుని చిరుధాన్యాల పంటల సాగు, కొనుగోలు, ఆహారోత్పత్తుల తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది యాసంగి సీజన్ పురస్కరించుకుని తాజాగా రాజేంద్రనగర్‌లోని జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థతో ఆగ్రోస్ ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతులతో సాగు చేయించాలని ప్రణాళిక రూపొందించింది. యువతకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని... వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకుని బయటకొస్తున్న పట్టభద్రులకు ఇదొక చక్కటి ఉపాధి మార్గమని... అర్హులైన ప్రతి ఒక్కరూ పూర్తి సద్వినియోగం చేసుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం వల్ల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందుతున్నారు. మొదటగా డెమో చేస్తున్నాం. ఆ తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే కష్టం. అందుకే స్వయం ఉపాధి ఎంచుకుంటే మనమే మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు. నిరుద్యోగ యువత ఈ చొరవ చూపిన ఆగ్రోస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
-- వినోద్‌కుమార్, అటవీ అధికారి, సింగరేణి కాలరీస్
నేరుగా సంప్రదించవచ్చు...
ఫిబ్రవరి మొదటి వారంలో మారుతి సంస్థతో ఒప్పందం చేసుకుని అర్హులైన యువ వ్యవసాయ పట్టభద్రులకు స్వయం ఉపాధి కల్పించాలని టీఎస్ ఆగ్రోస్ లక్ష్యంగా పెట్టుకుంది. భాగ్యనగరం వేదికగా అంకురార్పణ చేయనున్న వినూత్న కార్యక్రమం కింద లబ్ధిపొందేందుకు ఆసక్తిగల వ్యవసాయపట్టభద్రులు నేరుగా సంప్రదించవచ్చని ఆసంస్థ పేర్కొంది.
ఇదీ చదవండి: గవర్నర్‌ను కలిసిన చినజీయర్.. సమారోహ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం