ఫుడ్ పాయిజన్ కావడంతో ఏకంగా 35 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్ద గోప్లాపూర్ గ్రామంలో జరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే గొర్రెలు మృతి చెందినట్లు పశు వైద్యులు జీసన్ అలీ తెలిపారు.
పత్తి మొక్కలు తినడంతోనే
గ్రామానికి చెందిన ఆంజనేయులు, మల్లేశ్, వెంకటస్వామి కొన్ని రోజులు కర్ణాటక సరిహద్దులో గొర్రెల మందను మేపేందుకు వలస వెళ్లారు. అక్కడ పొలాల్లో దూది తీసిన పత్తి మొక్కలను తిన్న గొర్రెలు అనారోగ్యానికి గురయ్యాయి. వైద్యుల సూచనలతో మందులు వాడినా.. పరిస్థితి విషమించడంతో గొర్రెలు మృత్యవాత పడ్డాయని బాధితులు వాపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రంలోని పశువ్యాధి నిర్ధరణ కేంద్రానికి పంపించారు.
ఫుడ్ పాయిజన్ వల్లే గొర్రెల శరీరంలోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సకాలంలో సరైన మందులు వాడకపోవడంతోనే ఇలా జరిగిందని అంటున్నారు. గొర్రెల మృతితో తాము జీవనాధారం కోల్పోయామని.. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
తక్షణమే వైద్యమందించాలి
గొర్రెలు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించిన వెంటనే వైద్య సేవలు పొందడం ద్వారా వాటిని కాపాడుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచించారు. ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం వచ్చే విధంగా ఉంటే పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.