మార్కెట్లో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. అంత ధర వెచ్చించినా ఆరోగ్యకరమైన ఆహారం తినగలుగుతున్నామా అంటే అదీ లేదు. కనీసం ఇంట్లో అయినా కూరగాయలు, పండ్లు పెంచుదామా అంటే పట్టణాల్లో ఇళ్లే ఇరుగ్గా ఉంటాయి. ఇక వీటి పెంపకానికి ఇంటి ముందు స్థలం దొరకడం అసాధ్యమే. దీనికి పరిష్కారంగా మిద్దె సాగును ప్రారంభించారు.. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాం కిషన్. 330 గజాల స్థలంలో తన మూడంతస్తుల సొంత ఇంట్లో ఆయన మిద్దె తోటల పెంపకాన్ని చేపట్టారు.
ఇంటి చుట్టూ మొక్కలే
ఇంటి ముందు, ఇంటి వెనక, ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాలు, ఇంటి పైకప్పు పైన సుమారు 300 రకాలకు చెందిన వేయికి పైగా మొక్కల్ని ఆయన పెంచుతున్నారు. వీటిలో నిత్యం వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. వీటితో పాటు తులసి, కలబంద, గుంట గల్జేరు లాంటి ఔషధ మొక్కలు, జామ, బొప్పాయి లాంటి పండ్ల మొక్కలు, బంతి, మల్లె వంటి పూలమొక్కలు, అలంకరణ మొక్కలూ ఉన్నాయి.
ఖాళీ స్థలంలోనూ మొక్కలే
మిద్దె తోట పెంపకంతో కూరగాయలు, ఆకుకూరల కోసం మార్కెట్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందంటున్నారు రాంకిషన్. పూలు, అలంకరణ మొక్కలతో ఇంటి ముందు ఆవరణంతా గార్డెన్‌ను తలపిస్తోందని తెలిపారు. కేవలం తన ఇంట్లోనే కాకుండా పక్కనున్న 200 గజాల స్థలంలో కొర్రలు సైతం సాగు చేస్తున్నామని వెల్లడించారు. పట్టణంలో ఉన్న ప్రతి ఖాళీ స్థలంలో ఇలా చిన్నపాటి పంటలు పండిస్తే ఆహారం, ఆరోగ్యంతో పాటు అపరిశుభ్రతను దూరం చేసిన వాళ్లమవుతామంటున్నారు రాం కిషన్.
తెగులుకు వేపనూనె
మిద్దె తోట పెంచడానికి వాడేసిన బకెట్లు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫైబర్ కంటైనర్లను వినియోగించారు. వాటిల్లో మేకల ఎరువు, పశువుల ఎరువు, కాక్ పిట్, కొబ్బరి పీచు కలిపిన మిశ్రమాన్ని నింపారు. పొటాషియం ధాతు లోపాన్నిఅధిగమించేందుకు ఎర్రమన్ను, తెగుళ్లు, చీడపీడల నివారణ కోసం వేపపిండి లాంటివి అందులో కలిపారు. వాటిల్లో మొక్కలు నాటి పెంచుతున్నారు. తీగ జాతి మొక్కలు పెంచడానికి తీగలతో నిలువు పందిళ్లు వేశారు. ఇంట్లో వాడేసిన ఆహార పదార్థాలనే మొక్కలకు ఎరువు కింద వేస్తున్నారు. మొక్కలకు తెగులు పడుతుందనిపించినప్పుడు వేపనూనె పిచికారీ చేస్తున్నారు.
మిద్దె తోటతో ఇంటి పైకప్పు దెబ్బతినదు
మిద్దె తోట అనగానే బరువు అధికమై, నీటి పారకం వల్ల ఇల్లు, పైకప్పు దెబ్బతింటున్నందని భవన యజమానులు భయపడుతుంటారు. అలా జరగకుండా పిల్లర్లు, భీమ్‌లు ఉన్నచోట బరువైన కంటైనర్లు, పైకప్పు ఉన్న చోట తేలికైన మొక్కలు పెంచారు. ప్రతి కంటైనర్ పైకప్పుకు తాకకుండా కింద కేసింగ్ పైపులను వేశారు. కంటైనర్లు, బకెట్ల నుంచి వచ్చే మిగులు నీరు పైపుల ద్వారా నేరుగా కిందకు దిగేలా మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. బరువు లేకుండా ఉండేందుకు మట్టి వాడకుండా పశువుల, మేకల ఎరువు, కాక్ పిట్‌ను మాత్రమే వినియోగించి..మొక్కలు పెంచుతున్నారు.
కేవలం తాను మాత్రమే కాదు.. ఇంట్లో ఖాళీ స్థలం, మిద్దెలున్న ప్రతి ఒక్కరు పెరటి తోటల్నిపెంచితే ఆహారం విషయంలో స్వయం సంవృద్ధి సాధించవచ్చన్నది రాంకిషన్ సూచన. ఇక పట్టణాల్లోని ఖాళీ స్థలాలను వ్యవసాయం కోసం వినియోగిస్తే పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికీ మేలని చెబుతున్నారు.