ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, మాఫియా ఆగడాలకు ముఖ్యమంత్రే అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమన్యయ కమిటి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ అనుమతుల పేరిట ఇష్టానుసారం వాగుల్లో ఇసుకను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
ఉన్నతాధికారులు, శాసనసభ్యులు కుమ్మక్కై నడిస్తున్న ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని దయాకర్ రెడ్డి తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తరలించవద్దని నిబంధనలు చెబుతున్నా.. ఎవరూ పాటించడం లేదని మండిపడ్డారు. భూకబ్జాల పైనా తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఎస్సీలకు మూడెకరాలు, రెండు పడక గదుల ఇళ్లు, మైనారిటీ రిజర్వేషన్లు సహా అనేక హామీలను తెరాస నెరవేర్చలేకపోయిందన్నారు.
కేంద్ర బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతుచట్టాల విషయంలో రైతులకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. భవిష్యత్ వ్యూహాలపై పార్టీ శ్రేణులకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ జీవన్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా పసుపు బోర్డు ఏర్పాటు