మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మాచారం గ్రామాల వద్ద అంతర్గత వంతెనల పనులు పూర్తయ్యాయని జడ్చర్ల ఎక్స్ప్రెస్ హైవే పర్యవేక్షణ ఇంజనీర్ ఇబ్రహీం తెలిపారు. ప్రజలకు అవి వారం రోజుల్లో వినియోగంలోకి వస్తాయన్నారు.
నిరీక్షణకు తెర..
ప్రజల రెండేళ్ల నిరీక్షణకు తెరపడనుందన్నారు. ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యంతో పాటు ప్రమాదాలు తగ్గనున్నాయని పేర్కొన్నారు.
జడ్చర్ల, మాచారం గ్రామాల వద్ద అంతర్గత వంతెనలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రస్తుత ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రూ.20 వేల కోట్ల వ్యయంతో వంతెనలు మంజూరయ్యాయి.
ప్రజాప్రతినిధుల ఒత్తిడితో..
ఈ పనులు 2019లో ప్రారంభంగా.. ఏడాదిలో పూర్తి చేయాల్సి ఉన్నా రెండేళ్లైనా జరగలేదు. అందువల్ల అటుగా వెళ్లే ప్రయాణికులు అసౌకర్యాలకు గురయ్యేవారు. నిత్యం ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేవి. గుత్తేదారు నిర్లక్ష్యం చేయడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ అధికారులు పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం మాచారం వద్ద బీటీ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే రాకపోకలు పునరుద్ధరించవచ్చు. జడ్చర్ల వద్ద వంతెన పూర్తయింది. పనులు తుది దశకు చేరడంతో వంతెనలు త్వరలో ప్రారంభం కానున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చిన 'ఫేస్బుక్' ఫ్రెండ్స్