నాలుగేళ్లుగా మిషన్ భగీరథలో పని చేస్తున్న తమను ఆకారణం తొలగించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నపలంగా విధులకు హాజరుకానివ్వకండి అంటూ సంబంధిత ఈఈలకు ఆదేశాలు జారీ చేశారని వాపోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవ్వరినీ ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథలోనే ఉద్యోగులను తొలగించడంపై విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 జూనియర్ అసిస్టెంట్లు గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. కారణం చెప్పకుండా విధులకు రావద్దని చెప్పడం వల్ల ఆగ్రహించారు. ముఖ్యమంత్రి స్పందించి తమను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.