కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రాష్ట్రమంతటా సంబురాలు జరుపుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు జలప్రదాయిని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందనే చర్చ సర్వత్రా మొదలైంది. శ్రీశైలం మిగులు జలాలను 60 రోజులపాటు రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున 90 టీఎంసీల నీటిని తోడుకుని 12 లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును రూపొందించారు.
30 శాతం పనులు కూడా పూర్తి కాలే!
35వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు భూత్పూరు మండలం కర్వెనలో 2015 జూన్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. డిసెంబరు 2018 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. గడవు ముగిసినా.. ఇప్పటికీ 30శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
ప్యాకేజీల్లో.. కొన'సా'గుతున్న పనులు..
నాగర్‌కర్నూల్ జిల్లా నార్లాపూర్ నుంచి రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవిపల్లి వరకు పాలమూరు- రంగారెడ్డి పనులను 21 ప్యాకేజీలుగా విడగొట్టారు. ప్రస్తుతానికి నార్లాపూర్‌లోని మొదటి ప్యాకేజీ నుంచి ఉదండాపూర్‌లోని 18వ ప్యాకేజీ వరకు పనులు కొనసాగుతున్నాయి.
మొదటి ప్యాకేజీ కింద పంపుహౌస్, ఇతర మట్టి పనులు చేపట్టాలి. ఇప్పటి వరకు 30శాతం పనులు పూర్తయ్యాయి. రెండో ప్యాకేజీలో నార్లాపూర్ అంజనగిరి జలాశయ పనులు కొనసాగుతున్నాయి. మూడో ప్యాకేజీ కింద నార్లాపూర్- ఏదుల మధ్యలో కాలువ, సొరంగం పనులు జరుగుతున్నాయి. నాలుగో ప్యాకేజీలో సొరంగ మార్గం పనులకు 350 కోట్లు ఖర్చు చేశారు.
నత్తనడక..!
ఐదో ప్యాకేజీలో మట్టి తవ్వకానికి సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆరో ప్యాకేజీలో ఏదుల రిజర్వాయర్ పనులు దాదాపుగా 90శాతం పూర్తయ్యాయి. ఏదుల నుంచి వట్టెంకు వచ్చే 6 కిలోమీటర్ల సొరంగం పనులు జరుగుతున్నాయి. ఏడో ప్యాకేజీలో 23 కిలోమీటర్ల సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. 8వ ప్యాకేజీలో వట్టెం పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. వట్టెం జలాశయం నిర్మాణం పనులు 9, 10, 11వ ప్యాకేజీల్లో కలిసి ఉన్నాయి. ఈ పనులూ.. నత్తనడకన సాగుతున్నాయి.
12వ ప్యాకేజీ కింద వట్టెం నుంచి కర్వెన వరకు కాలువ నిర్మాణం పనులు చేపట్టాలి. 85శాతం పనులను పూర్తి చేశారు. కర్వెన జలాశయం నిర్మాణం పనులు మొత్తం 13, 14, 15వ ప్యాకేజీల కింద కేటాయించారు. ఈ మూడు ప్యాకేజీలకు 2వేల కోట్లు కేటాయించగా.. 40 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన 16, 17, 18 ప్యాకేజీల్లో కేటాయించిన పనులు చేపట్టాల్సి ఉంది.
ఇంకా భూసేకరణే జరగలేదు!
కర్వెన- ఉదండాపూర్ మధ్యలో 9 కిలోమీటర్లు, నార్లాపూర్- ఏదుల మధ్యలో 16 కిలోమీటర్లు, ఏదుల- వట్టెం మధ్యలో 26 కిలోమీటర్లు, చెన్నపురావుపల్లి, కొత్తపేట సమీపంలో 16 కిలోమీటర్ల సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. 18 ప్యాకేజీల్లో 67 కిలోమీటర్ల సొరంగం పనులు కొనసాగుతున్నాయి. 18వ ప్యాకేజీ తర్వాతి పనులు సర్వే దశలో ఉన్నాయి.
లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మాణానికి ఇంకా భూసేకరణే జరగలేదు. టెండర్ దశలోనే పనులు నిలిచిపోయాయి. కరవు పీడిత ప్రాంతమైన షాద్నగర్ నియోజకవర్గంలో పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.