Koil Sagar Canal Works: 50వేల ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కోయల్ సాగర్ సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూరాల నుంచి రెండు లిఫ్ట్ ల ద్వారా 3.90 టీఎంసీల నీటిని కోయల్ సాగర్ జలాశయానికి ఎత్తిపోయడం, అక్కన్నుంచి కుడి,ఎడమ కాల్వల ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అందుకోసం ప్రస్తుత కోయల్ సాగర్ కుడి,ఎడమ కాల్వల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నమ్మకం లేదంటున్న రైతులు..
ఎడమ కాల్వ సుమారు 28.3 కిలోమీటర్లు ఉండగా లైనింగ్ పనులు పూర్తయ్యాయి. కుడికాల్వ 12.7కిలోమీటర్లకు ఉండగా కేవలం 3 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2021 ఫిబ్రవరిలోనే ఈ పనులు ప్రారంభించినా రైతులకు వానాకాలంలో సాగునీరు అందించేందుకు తాత్కాలికంగా పనులు ఆపారు. జూన్ కల్లా పనులు పూర్తి చేసి వానాకాలంలో నీరందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు పంట విరామానికి అంగీకరించారు. కానీ పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే సకాలంలో పూర్తవుతాయన్న నమ్మకం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
జూన్ నాటికి పూర్తి చేస్తామంటున్న అధికారులు..
31.79 కోట్ల అంచనా వ్యయంతో 12 కిలోమీటర్ల పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం 9కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 22కోట్ల పనులు పూర్తికావాల్సి ఉంది. 18అవుట్ లెట్లు, 8కాజ్ వేలు, 18తూములు, 8 వంతెనలు ఇలా కుడికాల్వ పరిధిలో 52 నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చివరి ఆయకట్టుకు నీరందాలంటే కాల్వ వెడల్పు పెంచి కట్టలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. జూన్ నాటికి కుడికాల్వ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా పూర్తి చేయాలని డిమాండ్..
ఎడమ కాల్వపై లైనింగ్ పనులు పూర్తైనా నిర్మాణాలు, పిల్ల కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. కుడి కాల్వపైనా పిల్ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా పనులు పూర్తి స్థాయిలో చేపట్టకుండా సగంలోనే వదిలేస్తే 50వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఇప్పట్లో నెరవేరదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల పరిధిలో కోయల్ సాగర్ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పూర్తి ఆయకట్టుకు నీరందాలంటే అన్ని పనుల్ని ఏకకాలంలో వేగంగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: