మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గోపన్‌పల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. 72 కుటుంబాలు ఉన్న ఎస్సీల బస్తీని సందర్శించి.. అక్కడున్న అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు రెండు పడక గదులను మంజూరు చేశారు. ఎస్సీ వాడలో పెండింగ్‌లో ఉన్న వంద మీటర్ల మురుగు కాలువ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని, సామాజిక భవనం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావును ఆదేశించారు. ఛైర్మన్ ఆదేశాలతో సామూహిక భవనానికి, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ నిధులను మంజూరు చేశారు.
రాజ్యాంగం ద్వారా కల్పించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. కమిషన్‌పై వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు అన్ని విభాగాల వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంపాల్ నాయక్, నీలాదేవి, విద్యాసాగర్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ రజిత, ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు, ఉప సర్పంచ్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం