Sarpanchs protests for Panchayat bills : గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా జనం వెళ్లేది సర్పంచ్ దగ్గరికే. పల్లెల్లో ప్రజల అవసరాలు తీరాలన్నా, ప్రగతి బాటలు వేయాలన్న సర్పంచ్‌లదే కీలక భూమిక. అలాంటి గ్రామ సర్పంచ్‌లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బిల్లులు చెల్లించాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కొందరు సర్పంచ్‌లు ధర్నా చేశారు.
పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, చెత్తను వేరు చేసే షెడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. చాలాచోట్ల సర్పంచ్‌లే ముందుండి పనులు పూర్తి చేయించారు. ముందుగా నిధులు రాకపోయినా తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి పనుల్ని పూర్తి చేశారు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు రైతు వేదికల నిర్మాణాలను సైతం స్వయంగా చేపట్టారు. వచ్చే నిధుల్ని అంచనా వేసుకుని సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఆయా శాఖల నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప సర్కారు నుంచి బిల్లులు రావడం లేదని సర్పంచులు వాపోయారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్రం, రాష్ట్రం సమానంగా ప్రతి గ్రామానికి జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా నిధులు విడుదల చేయాలి. అలాంటి నిధులు కేంద్రం నుంచి 8 నెలలుగా, రాష్ట్రం నుంచి 4 నెలలుగా అందడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి ట్రాక్టర్‌కు నెలసరి వాయిదాలు, మల్టీ పర్పస్ కార్మికులకు వేతనాలు, కరెంటు బిల్లులు ఇతర నిర్వహణ ఖర్చుల్ని చెల్లించాల్సి ఉంటుంది. బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేతి నుంచి ఖర్చు చేస్తున్నామని సర్పంచ్‌లు చెబుతున్నారు.
మూడేళ్ల వరకు క్రమం తప్పకుండా నిధులు అందేవని.. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. దీనికి తోడు ఉపాధి హామీ పోర్టల్‌లో మార్పుల కారణంగా గతంలో చేపట్టిన అనేక రకాల పనుల్ని ప్రస్తుతం చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడంతోపాటు, గ్రామాలకు రావాల్సిన నిధుల్ని సకాలంలో అందేలా చూడాలని సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: