మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పశువుల సంతలో వెలుగుచూసిన అక్రమాలపై జిల్లా పాలనాధికారి విచారణ చేపట్టారు. నకిలీ రశీదులతో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటనపై గ్రామ సర్పంచ్, ఈవో, ఎంపీడీవోలపై వేటు వేశారు.
పంచాయతీ ఆదాయానికి గండి
జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించే పశువుల సంతలో.. దేవరకద్ర పశువుల సంత ప్రధానమైనది. గత ఆర్థిక సంవత్సరంలో వేలంపాట పూర్తికాకపోవడం వల్ల.. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంతలో జరిగే క్రయవిక్రయాలకు పన్ను వసూలు చేసి ఇచ్చేవారు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారుడు నకిలీ రసీదు బుక్కులను తయారుచేసి సంతలో జరిగే క్రయవిక్రయాలకు నకిలీ రసీదులు ఇస్తూ అక్రమంగా వసూళ్లు చేస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొట్టాడు.
రెడ్‌హ్యాండెడ్‌గా..
గతవారం తనిఖీలు చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నకిలీ రశీదు పుస్తకాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన సర్పంచ్, ఈవో, ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న సంబంధీకుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడం వల్ల బుధవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు.... సర్పంచ్ కొండా విజయలక్ష్మి, ఈవో వనిత, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ.. తుది విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి: విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టి... హత్య