ఇసుక రవాణాతో గ్రామంలోని భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్‌లోని అల్లిపూర్ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. చిన్నచింతకుంట మండలంలోని అల్లీపూర్ వాగు నుంచి జిల్లా కేంద్రంలోని రెండు పడక గదుల నిర్మాణం కోసం.. ఇసుకను తరలించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పాలనాధికారి ఉత్తర్వులతో ఇసుకను తరలించేందుకు వచ్చిన భారీ యంత్రాలు, టిప్పర్లను అడ్డుకొని... రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపునకు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... అల్లీపూర్ గ్రామం నుంచి చిన్నచింతకుంట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. రైతుల వినతిని పైఅధికారులకు తెలియజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అన్నదాతలకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు