Kurumurthy Jathara: మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంట మండలం అమ్మాపురంలో ఏటా దీపావళి తర్వాత నెలరోజులపాటు జరిగే కురుమార్తి జాతర... రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రసిద్ధి గాంచింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కురుమార్తి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన కురుమూర్తిరాయిడే కాదు... తూరుపు పొడ కోడెల అమ్మకానికీ కురుమూర్తి జాతర పేరుగాంచింది. నల్లమలకే ప్రత్యేకమైన పశువుల జాతైన తూరుపు పొడ కోడెల్ని వందలాదిగా తరలించి ఆ జాతరలో విక్రయిస్తుంటారు.
అమ్రాబాద్, అచ్చంపేట, లింగాల, పదర, మద్దిమడుగు ప్రాంతాల్లోనే ఆ పశువులు ఉంటాయి. కురుమూర్తి జాతరకు వారం రోజులకు ముందే అక్కడకు వెళ్లే వ్యాపారులు... వందలాది పశువుల్ని కొనుగోలు చేసి 100 కిలోమీటర్ల మేర కాలినడకన జాతరకు తీసుకువస్తారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్నూల్, ఎమ్మిగనూరు, మంత్రాలయం నుంచి వచ్చే రైతులు వాటిని కొనుగోలు చేస్తుంటారు. నారాయణ పేట జిల్లాలోని మద్దూరు, దౌల్తాబాద్, దామరగిద్ద మండలాల్లో తూరుపు పొడ పశువులు అధికంగా కనిపిస్తాయి. కురుమూర్తి కోడెల పేరిట జత 30 వేల నుంచి 40 వేల వరకు అమ్ముతారు.
ఇంతకీ కురుమూర్తి కోడెలకు ఎందుకింత డిమాండ్ అంటే.. తూరుపు పొడ పశువులు నల్లమల అటవీ ప్రాంతంలోనే పెరుగుతాయి. ఈ పశువులకు పాలు పితకరు. నేరుగా లేగదూడలకే అందిస్తారు. అందువల్ల బలంగా పెరుగుతాయి. నల్లమలలోని అటవీ గ్రాసాన్ని తింటాయి. కాబట్టి వీటికి రోగనిరోధక శక్తి అధికం. స్వచ్ఛమైన నీళ్లు తాగుతాయి. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు అలవోకగా ఎక్కేస్తాయి. గిట్టలు మెత్తబడవు. తక్కువమేత తిని ఎక్కవకాలం నీళ్లులేకుండా ఉండగలవు. రోజులో ఎక్కువసేపు పని చేయగలవు. వ్యవసాయ పనుల కోసం అలాంటి పశువులే రైతులకు అవసరం. ఏ ఇతర సంకరజాతి పశువుల్లో కనిపించని సామర్ధ్యం వీటిల్లో ఉండటం వల్ల వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. శరీరంపై మచ్చలు వీటి ప్రత్యేకత. భారత ప్రభుత్వం 2020 మార్చిలో 44వ జాతీయ పశువుగా తూరుపు జాతి పొడను గుర్తించింది. ఈ జాతికి సుమారు 400ఏళ్ల చరిత్ర ఉంది.
ఇవీ చదవండి: