Rahul Gandhi Fires on KCR and Modi: రాజకీయ నాయకులు ప్రజల మాట వినాలని.. భాజపా, ఆర్ఎస్ఎస్, తెరాస పార్టీలు కలిసి ప్రజల గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా సోలిపురం జంక్షన్లో జరిగిన కూడలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. మోదీ, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి, గొడవలు పెంచి, హింసను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టామని వివరించారు.
ఏం జరిగినా యాత్ర ఆగదని, కశ్మీర్ చేరుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల గొంతుకైన ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రైవేటుపరం చేస్తున్నారని యువకులు ఆరోపిస్తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు లేక కూలీలుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివినా.. దానికి తగిన ఉద్యోగం లేక యువత బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించకపోవడంతో డబ్బు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ చిరు, మధ్యతరహా వ్యాపార రంగం, చేనేత రంగాన్ని కుదేలు చేసిందన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక చేనేత రంగంలో చెల్లించిన జీఎస్టీకి పరిహారం చెల్లిస్తామన్నారు. చిరు, మధ్యతరహా వ్యాపారులే దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిందని విశ్లేషించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కుదేలైన ఆ రంగాలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యారంగానికి ప్రాధన్యమిస్తూ అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఓవైపు నిరుద్యోగం.. మరోవైపు ధరల పెరుగుదల జనాన్ని పట్టిపీడీస్తున్నాయని, ఏటా రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, కేసీఆర్ ఉద్యోగాల కల్పన విషయంలో మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు.
దళిత, గిరిజన, ఆదివాసుల నుంచి తెరాస సర్కారు భూములు లాక్కుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లాక్కున్న భూముల్ని తిరిగి ఇప్పిస్తామని, ఆ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ధరల పెరుగుదలపై గతంలో విమర్శలు గుప్పించిన మోదీ, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగితే.. ఇప్పుడు నోరుమెదపడం లేదని విమర్శించారు. భాజపాకు తెరాస మద్దతు పలుకుతోందని.. భాజపా- తెరాస ఒక్కటేనన్నారు. ఎన్నికలప్పుడే డ్రామాలు చేస్తారని.. పరోక్షంగా కలిసి పని చేస్తారని దుయ్యబట్టారు.
భాజపా ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం ఖర్చుపెడుతోందని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న ప్రజాధనాన్నే ఎన్నికల్లో పంచి పెడుతున్నారని అన్నారు. రాజకీయాలు సైతం ఒకరిద్దరి కోసమే చేస్తున్నారన్నారు. దేశంలోని దాదాపు అన్నిరంగాల వ్యాపారాల్ని మోదీ తన మిత్రులకు అప్పగించారన్నారు. మరోవైపు విద్య, వైద్యం మీద ఖర్చుపెట్టాల్సిన సొమ్మును నీటి పారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేస్తూ కేసీఆర్ తన జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: