ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వీఆర్ఓలు రెవెన్యూ దస్త్రాల అప్పగించే ప్రక్రియ జోరుగా సాగింది. వీఆర్వో వద్ద ఉన్న దస్త్రాలన్నింటినీ ఒక్కటీ వదలకుండా తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పగించాలన్న ఆదేశాల మేరకు సిబ్బంది మండలంలోని కార్యాలయాలకు చేరుకుని దస్త్రాలు అప్పగించారు. రెవెన్యూ దస్త్రాలతోపాటు.. కల్యాణ లక్ష్మి, ఎన్నికలు, సర్వేలు, ఎంక్వైరీలకు, రిజిస్టర్లు, ఒరిజినల్ రికార్డులు అధికారులకు అప్పగించారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ప్రక్రియ జోరుగా సాగింది. మహబూబ్ నగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ వెంకట్రావు సందర్శించారు. వీఆర్వోలు అప్పగించిన దస్త్రాలను పరిశీలించారు. అన్నింటినీ స్కాన్ చేయాల్సిందిగా సూచించారు. ఎవరి దగ్గరా దస్త్రాలు లేకుండా పూర్తిగా స్వాధీనం చేసుకోవాల్సిందిగా సూచించారు. జిల్లావ్యాప్తంగా 9బృందాలు ఏర్పాటుచేసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ప్రభుత్వానికి దస్త్రాలు అప్పగిస్తామని తెలిపారు.