Priyanka Gandhi Palamuru Tour Today : రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం(Congress Election Campaign in Telangana)చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆ వ్యూహాల్లో భాగంగానే నేడు(మంగళవారం), బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
Priyanka Gandhi Kollapur Meeting Today : ప్రియాంక గాంధీ నేడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పాలమూరు ప్రజాభేరి సభ(Congress Public Meeting in Palamuru)లో పాల్గొంటారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా గతంలో రెండుసార్లు సభలు ఏర్పాటు చేసినా.. అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కొల్లాపూర్‌లో జరిగే భారీ బహిరంగసభకు ప్రియాంక హాజరుకానున్నారు. పాలమూరు ప్రజాభేరి సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు.
Priyanka Gandhi Visits Palamuru Today : ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలం తిమ్మాయిపల్లి తండాలో ప్రియాంక పర్యటించాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు.
"పాలమూరు బహిరంగ సభకు 2.30 లక్షల మంది జనాభా స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ఇందిరమ్మ మనవరాలు వస్తోందని.. ఆమెను చూడాలని.. ఆమె మాటలు వినాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరాచక పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు నేటి సభకు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఈసారి పట్టం కట్టాలని చూస్తున్నారు." - జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి
Rahul Gandhi visit to Palamuru on November 1 : నవంబర్ 1న ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. బస్సుయాత్ర(Telangana Congress Bus Yatra)లో భాగంగా ఆయన కల్వకుర్తి నియోజక వర్గంలో జరిగే కూడలి సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ద్వారా జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ జరిగే కూడలి సమావేశంలో పాల్గొని షాద్ నగర్ పట్టణానికి చేరుకోనున్నారు. పట్టణంలో పాదయాత్ర అనంతరం కూడలి సమావేశంలో మాట్లాడనున్నారు. రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
Rahul Gandhi Bharat Jodo Yatra in Telangana : ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమై దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ నియోజక వర్గాల మీదుగా సాగింది. ఈ యాత్ర హస్తం పార్టీ నేతల్లో జోష్‌ని నింపింది. అన్ని నియోజక వర్గాలకు అభ్యర్ధులు ఖరారైన నేపథ్యంలో అగ్రనేతల యాత్రల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు భావిస్తున్నారు. యాత్రను విజయవంతం చేయడం ద్వారా సత్తా నిరూపించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అగ్రనేతల యాత్రల ద్వారా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం తదితర అంశాలపై నేతలు మాట్లాడే అవకాశం ఉంది.