Teacher Sleeping in Class: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. పట్టపగలే పీకలదాకా తాగి తరగతి గదిలోనే గుర్రుపెట్టి నిద్ర పోతున్న వీడియోలు వైరలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టిబోయిన్‌పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే.. ఈ పాఠశాలకు కేవలం 25 మంది విద్యార్థులే వస్తున్నారు. వీరికి ఒక్కడే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు.
అయితే.. ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయుడైనా బాధ్యతగా.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడా అంటే.. అదీ లేదు. పీకలదాకా మద్యం సేవించి రావటం. ఉన్న పిల్లలందరినీ ఒక్క చోట కూర్చోబెట్టడం. ఏవో రెండు ముచ్చట్లు చెప్పి.. చదువుకొమ్మని చెప్పటం. తనకు కేటాయించిన సింహాసనంలో ఆసీనుడై.. సోయి లేకుండా కునుకు తీయటం. ఇదీ మాస్టారు గారి నిర్వాకం. స్కూల్లోకి ఎవరు వస్తున్నారు..? ఎవరు వెళ్తున్నారు..? పిల్లలు ఏం చేస్తున్నారు..? ఇవేవి ఆయనగారికి అనవసరం. వచ్చామా.. కునుకు తీశామా.. సమయం కాగానే వెళ్లిపోయామా.. ఇది ఆయన దినచర్య.
గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ తంతు తెలుసుకున్న గ్రామస్థులు ఈ నెల 28న పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. గ్రామస్థులు వెళ్లేసరికి సదరు ఉపాధ్యాయుడు.. తరగతి గదిలోనే కుర్చీలో లోకం మరిచి గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలేపి.. నిలదీస్తే.. పొంతనలేని సమాధానాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆయన సంభాషణ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కాగా.. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి.. ఉన్నతాధికారులకు నివేదించారు. మరోవైపు పిల్లలు సైతం.. తమ ఉపాధ్యాయుడు రోజూ మద్యం తాగి.. పాఠశాలకు వచ్చేవాడని.. ఎలాంటి పాఠాలు బోధించకుండా నిద్రపోయే వాడని చెబుతున్నారు.
ఇదీ చూడండి: