ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మహిళలకు ప్రసవ కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా కొత్త జిల్లా కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చేవారు అవస్థలు పడుతున్నారు. గత నెల చివరివారంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ గర్భిణి ఆరు ఆస్పత్రులు తిరిగి.. చివరకు పుట్టిన బిడ్డతోసహా మృతిచెందిన విషయం విదితమే. తాజాగా గురు, శుక్రవారాల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రి నుంచి ఇదే కోవకు చెందిన రెండు కేసులు ఒకటి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి, మరొకటి హైదరాబాదుకు రెఫర్ చేశారు.
హైవేల్లో అంబులెన్సులు
ఆరు ఆస్పత్రులు తిరిగి మృతిచెందిన తల్లీబిడ్డల కేసు విచారణ సందర్భంగా ‘అసలు హైవేల్లో అంబులెన్సులు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు?.. ప్రసవాల వంటి అత్యవసర సేవలను ఎందుకు అందించడం లేదంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాలమూరు జిల్లాల్లో గత మార్చిలో 2,975, ఏప్రిల్‌లో 2,925 కాన్పులు జరిగాయి. గర్భిణుల పరిస్థితి విషమంగా ఉంటే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి పంపిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మాత్రమే
కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం అవుతుండటం ప్రాణాల మీదకు తెస్తోంది. ఉమ్మడి పాలమూరులో అలంపూర్ నుంచి బాలానగర్ వరకు సుమారు 170 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. హైవేలపై ఉన్న మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో వైద్యులు కూడా సక్రమంగా ఉండరు. కొన్నిచోట్ల ‘అమ్మ ఒడి’ వాహనాలు ఉన్నప్పటికీ అవి స్థానికంగానే సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం జాతీయ రహదారిపై ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
కరోనా సర్వే పనులకు అంగన్‌వాడీ, ఆశాలు
సాధారణంగా గ్రామాల్లో గర్భిణులను అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశాలు, ఏఎన్‌ఎంలు తరచూ పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు వారి వైద్యానికి కావాల్సిన సూచనలు చేస్తుంటారు. లాక్‌డౌను అనంతరం కరోనా సర్వే పనులకు ప్రభుత్వం వీరిని ఉపయోగించుకుంటోంది. ప్రతి రోజు ఇంటింటికి తిరిగి క్వారంటైను వివరాలు ఆరా తీస్తున్నారు. దీంతో గర్భిణులకు అందుతున్న సేవలపై తగినంతగా దృష్టి పెట్టడం లేదు. అంబులెన్సులు, 108 వాహనాలను కూడా కరోనా కేసుల కోసమే ఉపయోగిస్తున్నారు. దీంతో గర్భిణులకు సమయానికి అంబులెన్సులు దొరకడం లేదు. ఎలాగో ప్రయాస పడి ఆస్పత్రులకు వచ్చేసరికి ఆరోగ్య పరిస్థితి చేయి దాటిపోతోంది.
వివిధ రకాల వ్యాధులతో
గద్వాల ఆస్పత్రికి ప్రసవాలకు వచ్చే మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నామని, పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే మహబూబ్‌నగర్, హైదరాబాదులకు రెఫర్ చేశామని ఇన్‌ఛార్జి సూపరిండెంటెంట్ శోభారాణి తెలిపారు. కొందరు గర్భిణులు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారని, వీరికి ఆయా విభాగాల స్పెషలిస్టుల సమక్షంలో కాన్పు చేయాల్సి ఉంటుందని మహబూబ్‌నగర్ ఆస్పత్రి సూపరింటెండెంటు డా. రాంకిషన్ చెప్పారు. ఇటువంటి కేసులను మాత్రమే తాము హైదరాబాదుకు పంపుతున్నట్టు ‘ఈనాడు’కు తెలిపారు.
కాన్పు నిమిత్తం మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఓ గర్భిణికి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించారు. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన జయలక్ష్మికి గురువారం పురిటి నొప్పులు రావడంతో తొలుత అయిజలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమన్నారు. గద్వాలలో పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అదేరోజు రాత్రి జయలక్ష్మి జనరల్ ఆస్పత్రిలో చేరగా.. రాత్రి 11.30 సమయంలో వైద్యులు సిజేరియను చేశారు. మొదటి కాన్పులో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు జనరల్ ఆస్పత్రి వైద్యులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలక్ష్మి
ఇదీ చూడండి : భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో..