మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి పారిశ్రామికవాడలోని 12 ఫార్మా పరిశ్రమలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ పరిశ్రమలు వ్యర్థాలు బయటికి వదిలేయడంతో భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయని.. ప్రజలకు హాని కలుగుతోందని గతంలో కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. విచారించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలకు ఆదేశించింది.
ఈ ఏడాది జనవరిలో పరిస్థితిని పరిశీలించిన అధికారుల బృందం.. జూలైలో తుది నివేదికను ఇచ్చింది. ఫార్మా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. పరిహారం చెల్లింపుకు జరిమానా విధించాలని నిర్ణయించారు. అయితే..అక్టోబర్ 31న హైదరాబాద్ లో పారిశ్రామిక నిర్వాహకులతో కాలుష్య నియంత్రణ మండలి సమావేశం నిర్వహించి చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. తమకు కొంత గడువు ఇవ్వాలని పరిశ్రమల యజమానులు కోరగా..14రోజుల గడువును విధిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నెల రోజుల వ్యవధిలో పరిశ్రమలపై చర్యలకు సిద్ధమవుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎట్టకేలకు పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంతో పోలేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలతోపాటు.. పరిశ్రమల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని.. కేసులు నమోదు చేయాలని కోస్గి వెంకటయ్య డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఉద్యోగాలు కల్పించాలని భూనిర్వాసితుల నిరసన