మున్సిపల్ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 5 జిల్లాల్లో 17 మున్సిపాలిటీలు, 338 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... 4 ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 820 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... సుమారు 5లక్షల 20వేల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మహబూబ్‌నగర్‌లో...
మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్ మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఓటర్లంతా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఐదుగురు సిబ్బంది, 10శాతం అదనపు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారన్నారు. మొత్తం 21 ప్రాంతాలు, 63 పోలింగ్ బూత్ లను సమస్యాత్మకమైనవని గుర్తించినట్లు తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
గద్వాల, వనపర్తిలో...
జోగులాంబ గద్వాల జిల్లాలోనూ యంత్రాంగం పోలింగ్‌కు సర్వసన్నద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 76 వార్డులకు 154 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 558 మంది సిబ్బంది పోలింగ్ కోసం పనిచేయనున్నారు. ఇప్పటికే 95శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు 80వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక వార్డు మాత్రమే ఏకగ్రీవమైంది. మొత్తం 162 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 22 అత్యంత సమస్యాత్మక, 51 సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సుమారు 800 మంది పోలింగ్ సిబ్బంది, 700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.
నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో...
నారాయణపేట జిల్లాలో 3మున్సిపాలిటీల్లోని 56 వార్డులకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా... ఒక వార్డు ఏకగ్రీవమైంది. 110 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. 36 సమస్యాత్మక, 14 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి బలగాలను మోహరించినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లోని 66 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 132 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 73వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 62 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి... వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించనున్నట్లు పాలనాధికారి తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... భద్రతా బలగాల మోహరింపుతో పాటు... ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.